దేహదారుఢ్య పరీక్షల ముందస్తు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి
నిజామాబాద్: కానిస్టేబుల్, ఎస్ ఐ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమ్స్
రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా తదుపరి ప్రక్రియల్లోనూ సఫలీకృతమై
నూటికి నూరు శాతం పోలీసు కొలువులు సాధించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ
నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉద్బోధించారు.
బాల్కొండ శాసనసభా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పోలీస్
కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఎంపికయ్యేలా తోడ్పాటును అందించడంలో
భాగంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో హైదరాబాద్ లోని ప్రముఖ
కోచింగ్ సెంటర్లకు ఏమాత్రం తీసిపోనివిధంగా నిష్ణాతులైన ఫ్యాకల్టీచే సుమారు
మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇప్పించిన విషయం విదితమే.
ఈ శిబిరంలో శిక్షణ పొంది ప్రిలిమ్స్ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు
దేహ దారుఢ్య పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ముందస్తు
శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి వేముల సోమవారం వేల్పూర్ క్రీడా మైదానంలో
లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 400 మందికి శిక్షణ
ఇప్పించగా, 168 మంది పోలీసు ఉద్యోగాల కోసం ప్రిలిమ్స్ లో అర్హత సాధించారని,
వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఇక్కడ ప్రీ కోచింగ్ తీసుకున్న వారిలో మరికొంత మంది గ్రూప్ ఎగ్జామ్స్ కు
సన్నద్ధమయ్యారని తెలిపారు. ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన 168 మంది ఫిజికల్
ఈవెంట్స్ లోనూ సత్తాను చాటి పోలీసు కొలువులను చేజిక్కించుకోవాలని
ఆకాంక్షించారు. గట్టిగా కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా
సాధించగలరని సూచించారు. ప్రిలిమ్స్ రాత పరీక్ష తరహాలోనే, ఫిజికల్ ఈవెంట్స్ కు
కూడా సెగ్మెంట్లోని వేల్పూర్, మోర్తాడ్, భీంగల్, బాల్కొండ, కమ్మర్పల్లి
కేంద్రాలలో ముందస్తు శిక్షణ అందించేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలీసు
అధికారులు, పీ.ఈ.టీ లు శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు.
అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పోలీసు ఉద్యోగాలకు ఎంపికై
జీవితంలో స్థిరపడాలని హితవు పలికారు.
దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించేందుకు పురుష అభ్యర్థులు 1600 మీటర్ల
పరుగు పందెం, నాలుగు మీటర్ల లాంగ్ జంప్, 7.26 కిలోల బరువు కలిగిన షాట్ ఫుట్ ను
6మీటర్ల దూరం విసరాల్సి ఉంటుందని వివరించారు. మహిళా అభ్యర్థులు 800 మీటర్ల
పరుగు పందెం, 2.5 మీటర్ల లాంగ్ జంప్, 4కిలోల బరువు కలిగిన షాట్ ఫుట్ ను నాలుగు
మీటర్ల దూరం విసరాల్సి ఉంటుందన్నారు. పై అంశాల్లో అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభ
చాటి పోలీసు ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు అంకితభావంతో ప్రణాళికాబద్ధంగా కృషి
చేయాలని మంత్రి వేముల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏ.సీ. పీ
ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి,
జెడ్పిటిసి భారతి తదితరులు పాల్గొన్నారు.