హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దర్శకత్వంలో రూపొందించిన ఫామ్‌హౌస్ ఫైల్స్ సినిమాలో పసలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కథ, స్క్రీన్ ప్లే విఫలమైందని తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. పైసలే లేనప్పుడు ఈడీ ఎలా విచారిస్తోందని ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్వుల పాలవుతూ తెలంగాణ పేరును దేశ వ్యాప్తంగా నవ్వులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి భారాసలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు రికవరీ చేయలేదో కేసీఆర్ ఇప్పటికీ సమాధానం చెప్పడం లేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలను వారాలపాటు ప్రగతిభవన్‌లో ఎందుకు బంధించారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ కేసును సీబీఐకి బదిలీ చేయాలనే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. కోర్టు తీర్పు భారాస ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు.