ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల హక్కులను తాలిబన్లు ఒక్కొక్కటిగా హరించేస్తున్నారు. గతేడాది ఆప్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లు ఆ దేశంలోని మహిళలపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఇప్పటికే బాలికల విద్యకు సంబంధించి నిషేధం విధించారు. తాజాగా మహిళలు జిమ్‌లు ఉపయోగించకుండా తాలిబన్ నిషేధించింది. అలాగే, చాలా ఉద్యోగ రంగాల నుంచి మహిళలను దూరం చేసింది. మహిళలు తల నుంచి కాలి వరకు దుస్తులు ధరించాలని ఆదేశించింది. మహిళలు జిమ్‌లు, పార్కులను ఉపయోగించకూడదని, ఈ నిషేధం అమల్లోకి వచ్చిందని కాబుల్‌లోని మంత్రిత్వ శాఖకు తాలిబన్ నియమించిన ప్రతినిధి మహమ్మద్ అకేఫ్ మొహజెర్ తెలిపారు.