2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ
ఐదు రోజుల్లో నూరుశాతం పెన్షన్లను పంపిణీ చేయాలి
డిఆర్ డి ఏ కాల్ సెంటర్ల ద్వారా పర్యవేక్షణ
ఆర్బిఐఎస్ ద్వారా పెన్షనర్ల ఫేషియల్ అథెన్టికేషన్
లబ్ధిదారులకు బయోమెట్రిక్, ఐరిస్ విధానం
అమరావతి : వైయస్ఆర్ పెన్షన్ కానుక కింద 63.87 లక్షల మంది లబ్ధిదారులకు
పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి నెల
పెన్షన్ మొత్తాలను ఫిబ్రవరి 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే, వారి
చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంకల్పంలో భాగంగా అధికార
యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. బుధువారం (ఫిబ్రవరి 1వ
తేదీ) తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని
ప్రారంభిస్తారని అన్నారు. ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1759.99 కోట్ల
రూపాయలను ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు. ఈ మొత్తాలను గ్రామ, వార్డు
సచివాలయాలకు పంపిణీ చేశామని సచివాలయాల ద్వారా వాలంటీర్లు, పెన్షనర్లకు వారి
ఇంటి వద్ద నేరుగా పెన్షనర్ల చేతికే పెన్షన్ మొత్తాలను అందచేస్తారని అన్నారు.
ఇందు కోసం 2.66 లక్షల మంది వాలంటీర్లు సిద్ధంగా వున్నట్లు తెలిపారు.
లబ్ధిదారులకు పెన్షన్ అందచేసే సందర్భంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్
విధానాలను అమలు చేస్తున్నామని అలాగే ఆర్బిఐఎస్ విధానంను కూడా అందుబాటులోకి
తీసుకువచ్చామని తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే
ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పెన్షన్ మొత్తాలను
ఐదు రోజుల్లో నూరుశాతం పంపిణీ పూర్తి అయ్యేలా వాలంటీర్లను ఆదేశించామని
అన్నారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో 15వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్
అసిస్టెంట్స్, వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు భాగస్వాములు
అవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల డి ఆర్ డి ఏ కార్యాలయాల్లోని
కాల్ సెంటర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని తెలిపారు.