‘ఫ్లయర్’ ను ఆవిష్కరించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 9న విశాఖ వేదికగా ‘నేషనల్ స్కిల్ కాన్క్లేవ్’ నిర్వహిస్తున్నట్లు ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. అందులో భాగంగా ఆ సమావేశానికి సంబంధించిన వివరాలను తెలిపే ‘ఫ్లయర్’ను ఆయన శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. పరిశ్రమలకు నైపుణ్య మానవవనరులను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన స్కిల్ ఎకో సిస్టంను ఈ సమావేశం ద్వారా జాతీయ స్థాయిలో మరింతగా చాటనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో నైపుణ్య,శిక్షణకు నాంది పలుకుతూ అర్థవంతమైన చర్చలు, వ్యూహాత్మక ప్రణాళిక, అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యం లక్ష్యంగా నిర్వహించే ఈ నైపుణ్య సమ్మేళనంలో వివిధ విభాగాలలో నైపుణ్యాలు కలిగినటువంటి ఐఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలు , ఐఏఎస్ అధికారులు పాల్గొంటారన్నారు. ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించి నైపుణ్యంలోని అంతరాలను అధిగమించేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి యువత ప్రభావితం చెందేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధికి తోడ్పడే విధానాలపై నిర్మాణాత్మక చర్చా కార్యక్రమాలు జరగనున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఇండస్ట్రీ 4.0 అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ ను సన్నద్ధం చేస్తున్నామన్నారు.సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ అభ్యాసాలు అనుసరిస్తూ అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిగా యువతీయువకులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ విధానమన్నారు. ఏపీఎస్ఎస్డీసీ, ఏపీఏసీ కలిసి నిర్వహిస్తున్న ఈ నేషనల్ స్కిల్ కాన్క్లేవ్ లో గత ఐదేళ్లలో ప్రభుత్వం నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు, పరిశ్రమలకు కావలసిన డిమాండ్ ఉన్న కోర్సులు, అకడమిక్, పరిశ్రమల మధ్య ఉన్న స్కిల్ గ్యాప్ ను తగ్గించడంపై ప్రధానంగా చర్చలు ఉంటాయని ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నేషనల్ స్కిల్ కాన్క్లేవ్ నిర్వహిస్తే యువతీ యువకులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఫ్లయర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ వినోద్ కుమార్, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య, సీడాప్ సీఈవో ఎం.కే.వి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.