చైనా, దక్షిణ కొరియాల అభ్యంతరం
ఒకుమా : పుష్కరకాలం క్రితం ప్రమాదానికి గురైన ఫుకుషిమా దైచీ అణు విద్యుత్
కేంద్రం నుంచి రేడియోధార్మిక వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే
ప్రక్రియను జపాన్ ప్రారంభించింది. చైనా, దక్షిణ కొరియాలతో పాటు స్వదేశంలోని
కొన్ని వర్గాల నుంచీ దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ
జపాన్ ఆ జలాలను పసిఫిక్ సముద్రంలోకి పంపించడాన్ని మొదలుపెట్టింది. 2011లో
ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం భూకంపం, సునామీ కారణంగా తీవ్రంగా దెబ్బతింది.
మూడు అణు రియాక్టర్లలోని కూలింగ్ వ్యవస్థలు అదుపుతప్పాయి. వాటి నుంచి
నిరంతరంగా లీకవుతున్న రేడియోధార్మిక నీటిని భారీ ట్యాంకుల్లో నిల్వ
చేస్తున్నారు. అణువిద్యుత్ కేంద్రం ప్రాంగణం మొత్తం ట్యాంకులతో నిండిపోయిందని
టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) తెలిపింది. ఫుకిషిమా అణు విద్యుత్
కేంద్రాన్ని పూర్తిగా నిలిపివేయడానికి ఈ వ్యర్థజలాలను విడుదల చేయాల్సిన
ఆవశ్యకత ఏర్పడిందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా స్పష్టం చేశారు. ప్రస్తుతం
వెయ్యి ట్యాంకుల్లో 13.7 లక్షల టన్నుల రేడియోధార్మిక జలాలు పోగై ఉన్నాయి. 2024
మార్చి నాటికి వీటిలో 31,200 టన్నుల జలాలను వదిలించుకోవాలన్నది టెప్కో
ప్రణాళిక. దీనిలో భాగంగానే 200 నుంచి 210 క్యూబిక్ మీటర్ల నీటిని శుద్ధి
చేసి, రేడియోధార్మిక గాఢతను తగ్గించి సముద్రంలోకి పంపింగ్ చేస్తున్నారు.
జపాన్ సముద్ర ఉత్పత్తులను నిషేధించిన చైనా : శుద్ధిచేసిన రేడియోధార్మిక
వ్యర్థ జలాల విడుదల ఆసియా-పసిఫిక్ దేశాల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ
నీటి వల్ల ఇక్కడి మత్స్య సంపదకు డిమాండ్ పడిపోతుందని చాలా మంది ఆందోళన
వ్యక్తం చేస్తున్నారు. జపాన్ వివాదాస్పద నిర్ణయంపై చైనా, దక్షిణ కొరియా
దేశాలు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటికే సియోల్‌లో నిరసనలు జరుగుతున్నాయి.
జపాన్‌లోనూ ఈ నీటి విడుదలను కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టగా
చేపల వేటపై ఆధారపడిన వారి ఉపాధికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. జపాన్ నుంచి
దిగుమతయ్యే అన్ని సముద్ర ఉత్పత్తులపై చైనా నిషేధం విధించింది. తక్షణమే
అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.