కరీంనగర్ : వెనుకబడిన వర్గాల పెన్నిధి, పూజ్యులు మహాత్మా జ్యోతిబా ఫూలే కు
భారత రత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి
వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మంగళవారం ఫూలే 197 వ
జన్మదిన సందర్భంగా కరీంనగర్ నగరంలోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో జరిగిన
జయంతి ఉత్సవాలలో వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫూలే విగ్రహానికి
పూలమాలలు వేసి వినోద్ కుమార్ నివాళులర్పించారు. ఫూలే సామాజిక సేవలను
స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే
గొప్ప సామాజికవేత్త, దేశంలో కుల వ్యవస్థ నిర్మూలన కోసం శ్రమించిన మహాత్మా
జ్యోతిబా ఫూలే కు భారత రత్న అవార్డు ఇవ్వాలని, అందుకు ఫూలే అన్ని రకాలుగా
అర్హులు అని అన్నారు. జ్యోతిబా ఫూలే కు భారత రత్న ఇవ్వాలని 2016 మే 6 వ తేదీన
కరీంనగర్ ఎంపీగా పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావించానని వినోద్ కుమార్
తెలిపారు. మహారాష్ట్ర లో పుట్టిన ఫూలే కోసం తాను భారత రత్న అవార్డు ఇవ్వాలని
డిమాండ్ చేసిన విషయాన్ని గమనించి ఆశ్చర్య పోయిన మహారాష్ట్ర ఎంపీలు తనను కలిసి
శుభాభి వందనాలు తెలిపారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. బలహీన, బడుగు వర్గాల
అభ్యున్నతి కోసం ఫూలే ఎంతో కృషి చేశారని, ఫూలే తన సతీమణి సావిత్రి బాయి ఫూలేను
చదివించి దేశానికి మొదటి ఉపాధ్యాయురాలిని అందించారని వినోద్ కుమార్
కొనియాడారు. జ్యోతిబా ఫూలే జయంతి అంటే బీసీ, బడుగు వర్గాలకు, ప్రతి సామాజిక
వ్యక్తికి గొప్ప పండుగ రోజు అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఫూలే ఆశయాలకు
అనుగుణంగా ముందుకు సాగాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.