కోర్టు విచారణకు హాజరై సాక్ష్యమిచ్చారు. ఆ సంస్థ కారణంగా తన జీవితం ఎలా
ప్రభావితమైందో న్యాయస్థానానికి వినిపించారు. బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలోనే
ఓ కొత్త పరిణామం. 130 ఏళ్లలో తొలిసారి ఈ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి
కోర్టుకు హాజరయ్యారు. ఫోన్ హ్యాకింగ్‌కు సంబంధించిన కేసులో ఓ వార్తా సంస్థకు
వ్యతిరేకంగా కింగ్ ఛార్లెస్ 3 రెండో తనయుడు ప్రిన్స్ హ్యారీ కోర్టు బోనులో
నిలబడి సాక్ష్యం చెప్పారు. బ్రిటన్‌కు చెందిన మిర్రర్ గ్రూప్ అనేక మంది
ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు
పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలకు సంబంధించి
ప్రిన్స్ హ్యారీతో పాటు వంద మందికిపైగా ప్రముఖులు కోర్టులో దావా వేశారు.
దీనిపై లండన్ కోర్టులో విచారణ చేపట్టగా ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు హ్యారీ
మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం తన భార్య మేఘన్ మర్కెల్,
పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఆయన సోమవారం లండన్ చేరుకున్నారు. ఈ ఉదయం
హైకోర్టు ఎదుట హాజరయ్యారు. తన వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు మిర్రర్
గ్రూప్ ఉపయోగించిన మోసపూరిత పద్ధతుల కారణంగా తన జీవితం ఎలా ప్రభావితమైందో
హ్యారీ ) కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడటమే గాక 1996
– 2010 మధ్య ప్రైవేటు ఇన్విస్టిగేటర్లను ఉపయోగించి మిర్రర్ గ్రూప్ తన
వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని తెలిపారు. ఇలా చట్టవ్యతిరేకంగా సేకరించిన
వివరాలతో 140 ఆర్టికల్స్‌ను ప్రచురించినట్లు హ్యారీ కోర్టుకు వివరించారు.
వాస్తవానికి ఈ కేసులో ప్రిన్స్ హ్యారీ సోమవారం కోర్టుకు హాజరవ్వాల్సి ఉండగా
ఆయన రాలేదు. జూన్ 4న ఆయన కుమార్తె ప్రిన్సెస్ లిలిబెత్ పుట్టినరోజు కావడంతో
లాస్ఏంజిల్స్ నుంచి ఆయన ఆలస్యంగా బయల్దేరారని హ్యారీ తరఫు న్యాయవాది
కోర్టుకు తెలిపారు. కాగా ఈ కేసులో మిర్రర్ గ్రూప్ తరఫు న్యాయవాదులు హ్యారీని
క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో హ్యారీని కోర్టులో
ప్రశ్నించనున్నట్లు సమాచారం.
గతంలో కింగ్ ఎడ్వర్డ్ VII కూడా : కాగా బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన
వ్యక్తులు కోర్టుకు హాజరవ్వడం 130 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 1870లో ఓ
విడాకుల కేసుకు సంబంధించి ఎడ్వర్డ్ VII కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. ఆ
తర్వాత 1891లో ఓ గ్యాంబ్లింగ్ కేసులోనూ ఇంగ్లీష్ హైకోర్టుకు వెళ్లి
సాక్ష్యమిచ్చారు. అయితే, ఈ రెండు కూడా ఆయన రాజు కాకముందే జరిగాయి.