టీనేజర్ మృతిపై భగ్గుమన్న యువత
భగ్గుమన్న ఫ్రాన్సు
పోలీసు కాల్పుల్లో యువకుడి మృతితో మొదలైన దాడులు
40 వేల మంది పోలీసుల్ని రంగంలోకి దించిన ప్రభుత్వం
పారిస్ : పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి ఘటనతో ఫ్రాన్సు భగ్గుమంది.
పారిస్ శివారులోని నాంటెర్రెలోని ట్రాఫిక్ స్టాప్ వద్ద నహెల్ అనే
యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనతో రెండు రోజులుగా హింసాత్మక ఘటనలు
కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ముఖ్యంగా
పారిస్ నగరంలోని స్కూళ్లు, టౌన్‌హాళ్లు, పోలీస్ స్టేషన్లు వంటి పలు ప్రభుత్వ
భవంతులు, వాహనాలు, ఇతర ఆస్తులకు నిప్పంటించారు. రాళ్లు రువ్వారు. వీటిని
నిలువరించేందుకు పోలీసులు పలుమార్లు బాష్పగోళాలు ప్రయోగించారు. దాడుల్లో 100కు
పైగా ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నట్లు అంచనా వేసింది. ఆందోళనకారుల దాడుల్లో 170
మంది పోలీసులకు గాయాలయ్యాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఫ్రాన్సు
ప్రభుత్వం నిర్ణయించింది.
సిబ్బంది, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సు, రైలు సర్వీసులను
నిలిపివేసింది. దీని ఫలితంగా రాజధాని, శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది
ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాడులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో
పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. ప్రస్తుతమున్న పోలీసుల సంఖ్యను 9 వేల
నుంచి 40 వేలకు పెంచింది. నిరసనకారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది.
యువకుడిపై కాల్పుల ఘటనకు కారకులపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని
తెలిపింది.
పారిస్ శివారులో కర్ఫ్యూ : ఫ్రాన్స్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల
యువకుడు మరణించిన అనంతరం తలెత్తిన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన
మంగళవారం నాటి రాత్రి పారిస్ శివారు ప్రాంతాల్లోనే చోటుచేసుకున్న ఈ అల్లర్లు
గురువారం దేశమంతా పాకాయి. పలు భవనాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
ఆందోళనల్లో పాల్గొన్న వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. దీంతో పారిస్
శివారులోని క్లామర్ట్ పట్టణంలో గురువారం రాత్రి కర్ఫ్యూ విధించారు. మరోవైపు
యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారి ప్రాసిక్యూషన్ ప్రారంభమైంది.
అతడిపై హత్యాభియోగాలు నమోదయ్యాయి. ఆందోళనకారులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో
పాఠశాలలకు, పోలీస్ స్టేషన్లకు, టౌన్ హాల్స్‌కు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు
బుధవారం రాత్రి నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి మంటలను
ఆర్పడం కష్టతరమవుతోంది. దాదాపు 100 ప్రభుత్వ భవనాలకు నష్టం వాటిల్లింది. ఒక్క
పారిస్ ప్రాంతంలోనే 40వేల మంది పోలీసులను మోహరించారు.