కుల్దీప్ ఆల్‌రౌండ్ జోరు, విజృంభించిన సిరాజ్
తొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. ప్రత్యర్థికి మ్యాచ్‌లో దాదాపుగా
అవకాశం లేకుండా చేసింది. తొలి రోజు సమంగా నిలిచిన బంగ్లాదేశ్‌పై రెండో రోజు
సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది.
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారత్ హీరో. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత
టెస్టు మ్యాచ్ బరిలోకి దిగిన అతడు బ్యాటుతో జట్టు మెరుగైన స్కోరు సాధించడంలో
కీలక పాత్ర పోషించడంతో పాటు బంతితో బంగ్లా వెన్ను విరిచాడు. బ్యాటుతో రాణించిన
అశ్విన్, బంతితో విజృంభించిన సిరాజ్లదీ రెండో రోజు భారత్ పైచేయి సాధించడంలో
కీలక పాత్రే. 271 పరుగులు వెనుకబడి, తొలి ఇన్నింగ్స్‌లో చేతిలో రెండు వికెట్లు
మాత్రమే ఉన్న బంగ్లాకు టీమ్ఇండియాను నిలువరించడం చాలా కష్టమైన పనే. మొదటి
టెస్టులో టీమ్ఇండియా తిరుగులేని స్థితిలో నిలిచింది. విజయానికి బలమైన పునాది
వేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 278/6తో రెండో రోజు, గురువారం తొలి ఇన్నింగ్స్
కొనసాగించిన భారత్.. 404 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ (58; 113 బంతుల్లో 2×4,
2×6), కుల్దీప్ యాదవ్ (40; 114 బంతుల్లో 5×4) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు.
అనంతరం కుల్దీప్ (4/33), సిరాజ్ (3/14) ధాటికి బంగ్లాదేశ్ నిలవలేకపోయింది.
ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
ముష్ఫికర్ (28) టాప్ స్కోరర్. మెహదీ హసన్ మిరాజ్ (16), ఎబాదత్ హుస్సేన్
(13) క్రీజులో ఉన్నారు. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే బంగ్లా ఇంకా 72 పరుగులు
చేయాలి.
బంగ్లా విలవిల: బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు ఏ దశలోనూ కుదురుకోనివ్వలేదు.
మందకొడి పిచ్‌పై బంగ్లా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్
తొలి బంతికి నజ్ముల్ శాంటో (0)ను ఔట్ చేయడం ద్వారా బంగ్లా పతనాన్ని సిరాజ్
ఆరంభించాడు. నాలుగో ఓవర్లోనే యాసిర్ అలీ (4)ని ఉమేశ్ ఔట్ చేయగా.. కాసేపటి
తర్వాత, చక్కగా బ్యాటింగ్ చేస్తున్న లిటన్ దాస్ (24)ను సిరాజ్ బౌల్డ్
చేశాడు. పట్టుదలగా ప్రతిఘటిస్తున్న మరో ఓపెనర్ జకీర్ హసన్ (20)ను కూడా
సిరాజ్ వెనక్కి పంపడంతో బంగ్లా 56/4కు పరిమితమైంది. ఆ తర్వాత కుల్దీప్ తన
స్పిన్‌తో బంగ్లాను కకావికలం చేశాడు. షకిబ్ (3), నురుల్ (16), ముష్ఫికర్,
తైజుల్ (0)లను చకచకా ఔట్ చేయడం ద్వారా ఆ జట్టును పీకల్లోతు కష్టాల్లోకి
నెట్టాడు. బంగ్లా 102/8తో నిలవగా.. మెహదీ హసన్, ఎబాదత్ అభేద్యమైన 9వ
వికెట్‌కు 31 పరుగులు జోడించారు.
ఆ ఇద్దరి పోరాటం : టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో నాలుగొందలు దాటడం
ఊహించనిదే. ఎందుకంటే ఓవర్‌నైట్ స్కోరు 278/6తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ
జట్టు కాసేపటికే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ (86; 254 బంతుల్లో
10×4)ను కోల్పోయింది. సెంచరీ చేస్తాడనుకున్న అతడు కేవలం నాలుగు పరుగులే
జోడించి జట్టు స్కోరు 293 వద్ద ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ దశలో అశ్విన్,
కుల్దీప్ చక్కటి బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించారు. బంగ్లా బౌలర్లను
నిస్పృహకు గురి చేస్తూ ఎనిమిదో వికెట్‌కు 92 పరుగులు జోడించి భారత్‌ను బలమైన
స్థితిలో నిలిపింది ఈ జంట. 22 నెలల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్
అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 22పై
సగటున్న అతడు పట్టుదలగా నిలిచాడు. మంచి డిఫెన్స్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన
కుల్దీప్.. 18 బంతుల తర్వాత ఖాతా తెరిచాడు. ఆ తర్వాత స్లాగ్ స్వీప్,
రివర్స్ స్వీప్ షాట్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు ఖాతాలో అయిదు టెస్టు
శతకాలున్న అశ్విన్.. ఎంతో సంయమనాన్ని, పరిణతిని ప్రదర్శిస్తూ కుల్దీప్తో
బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెస్టుల్లో 13వ అర్ధశతకాన్ని సాధించే
క్రమంలో అతడు రెండు సిక్స్‌లు కూడా కొట్టడం విశేషం. కుల్దీప్, అశ్విన్‌లు
ఇద్దరూ ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా బ్యాటింగ్ చేశారు. లంచ్ తర్వాత మెహదీ
హసన్ బౌలింగ్‌లో ముందుకొచ్చి భారీ షాట్ ఆడబోయి అశ్విన్ స్టంపౌట్ కావడంతో
ఎనిమిదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపట్లోనే కుల్దీప్, సిరాజ్
(4) వెనుదిరగడంతో ఇన్నింగ్స్ ముగిసింది. ఉమేశ్ యాదవ్ (15 నాటౌట్) రెండు
సిక్స్‌లతో అలరించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 404; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: నజ్ముల్ శాంతో
(సి) పంత్ (బి) సిరాజ్ 0; జకీర్ హసన్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; యాసిర్
అలీ (బి) ఉమేశ్ 4; లిటన్ దాస్ (బి) సిరాజ్ 24; ముష్ఫికర్ ఎల్బీ (బి)
కుల్దీప్ 28; షకిబ్ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 3, నురుల్ హసన్ (సి)
శుభ్‌మన్ (బి) కుల్దీప్ 16; మెహదీ హసన్ మిరాజ్ బ్యాటింగ్ 16; తైజుల్
(బి) కుల్దీప్ 0; ఎబాదత్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (44 ఓవర్లలో
8 వికెట్లకు) 133; వికెట్ల పతనం: 1-0, 2-5, 3-39, 4-56, 5-75, 6-97, 7-102, 8
– 102; బౌలింగ్: సిరాజ్ 9-1-14-3; ఉమేశ్ యాదవ్ 8-1-33-1; అశ్విన్
10-1-34-0; కుల్దీప్ యాదవ్ 10-3-33-4; అక్షర్ పటేల్ 7-3-10-0