బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి శ్రీలంక కంటే మెరుగ్గా ఉందని, బంగ్లాదేశ్‌లో చైనా అప్పుల ఉచ్చు లేదని ఢాకాలోని చైనా రాయబారి లీ జిమింగ్ పేర్కొన్నారు. రాజధానిలోని నేషనల్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన డీకాబ్-టాక్ కార్యక్రమంలో ఒక ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.
మెగా ప్రాజెక్టుల వ్యయంతో పాటు చైనా అప్పుల మొత్తం కూడా పెరగడంపై ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రాయబారి లీ జిమింగ్ మాట్లాడుతూ “బంగ్లాదేశ్‌లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా చైనా రుణ ఉచ్చు లేదు. పాశ్చాత్య వాణిజ్య రుణాలు, బహుళజాతి ఆర్థిక సంస్థల నుంచి లభించే రుణాలే శ్రీలంక విదేశీ రుణంలో ఎక్కువ భాగం.
ఆ దేశ(శ్రీలంక) విదేశీ రుణంలో10 శాతం కంటే తక్కువగా
చైనా రుణం వుంది. బంగ్లాదేశ్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. ఇక్కడి విదేశీ అప్పులో కేవలం 6 శాతం మాత్రమే చైనా అప్పు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే, శ్రీలంక కంటే బంగ్లాదేశ్ చాలా మెరుగైన స్థితిలో ఉంద”ని ఆయన వెల్లడించారు. బంగ్లాదేశ్ మొత్తం విదేశీ రుణం కూడా చాలా తక్కువగా ఉందన్నారు. బంగ్లాదేశ్‌తో సంబంధాల విషయంలో చైనా అనుసరిస్తున్న విధానం ఆశాజనకంగా ఉందని పేర్కొంటూ.. ఉజ్వల భవిష్యత్తు కోసం బంగ్లాదేశ్‌తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
రోహింగ్యాల సంక్షోభం గురించి రాయబారి లీ మాట్లాడుతూ, “రోహింగ్యాలను వారి స్వదేశం మయన్మార్‌కు త్వరగా రప్పించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. అయితే రఖైన్లో శాంతి తిరిగి నెలకొనే వరకు మనం వేచి ఉండాలి. బంగ్లాదేశ్‌లో చైనా పెద్ద పారిశ్రామిక సంస్థలను నిర్మించాలనుకుంటున్నది” అని లీ జిమింగ్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో పెద్ద పారిశ్రామిక సంస్థలను చైనా నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరత, శ్రేయస్సును కాపాడేందుకు చైనా, బంగ్లాదేశ్ కలిసి పనిచేస్తాయన్నారు. ఉయ్ఘర్ ముస్లింలకు వ్యతిరేకంగా పాశ్చాత్య మీడియా ప్రపంచవ్యాప్త ప్రచారం చేస్తున్నదని లీ జిమింగ్ ఆరోపించారు.
చైనాలోని ఉయ్ఘర్ ముస్లిం సమాజంలో చర్య తీసుకున్న వారిపై తీవ్రవాద కార్యకలాపాల ఆరోపణలు ఉన్నాయని, మతపరమైన, జాతి కారణాల వల్ల చైనాలో ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. చైనాలో దాదాపు 2.5 మిలియన్ల మంది ముస్లింలు నివసిస్తున్నారన్నారు. వీరిలో కొద్దిమంది తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాయబారి స్వగ్రామమైన కున్మింగ్లోని రైల్వే స్టేషన్‌పై ఐదుగురు ఉయ్ఘర్ ముస్లింలు దాడి చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. డీకాబ్ ప్రెసిడెంట్ రెజాల్ కరీం లోటస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి ఏకేఎం మొయిన్ ఉద్దీన్ స్వాగతోపన్యాసం చేశారు.