గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు నాగరాజన్ డిమాండ్
విజయవాడ : బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం నాణ్యమైన బియ్యంతో వండి పెట్టాలని
గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ డిమాండ్ చేశారు.
శుక్రవారం ఊర్మిళా నగర్ లోని గాంధీ ట్రస్ట్ ఆశ్రమంలో ఆయన కళ్ళకు గంతలతో ఈ
మేరకు డిమాండ్ చేస్తూ ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా గాంధీ
నాగరాజన్ విలేకరులతో మాట్లాడుతూ బడి పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం దారుణంగా
ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు పెట్టే భోజనాన్ని మంత్రులు
గాని, అధికారులు గానీ తినగలరా అంటూ ప్రశ్నించారు . నాణ్యమైన సన్నబియ్యంతో
విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆనాటి వరకు తాను కూడా
రేషన్ బియ్యం తింటానని చెప్పారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ బడి
పిల్లలకు పెట్టిన బియ్యంతోనే తాను కూడా భోజనం చేశారని, అటువంటి స్ఫూర్తి నేటి
నాయకుల్లో కొరవడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ఓట్లను కొనే వారికి
ఓటేయకండని పిలుపునిచ్చారు. పనికి ఆహార పధకం దారి మళ్లుతోందని ఆ పనులు కూడా
చిన్న పిల్లలతో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చట్టసభల్లో మహిళలకు 33%
రిజర్వేషన్లు అమలైన నాడే నిజమైన మహిళ సాధికారత లభించగలదని అన్నారు.
వాస్తవానికి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, ఆనాడే మహిళాభివృద్ధి
సాధ్యమవుతుందని గాంధీ నాగరాజన్ కోరారు. నేడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని,
నిజమైన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా పాటుపడాలని ఆయన అన్నారు. ఈ
కార్యక్రమంలో గాంధీ దేశం ట్రస్టు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి. భారతి
తదితరులు పాల్గొన్నారు.