విజయవాడ : బడుగు, బలహీన వర్గాలకు దిక్సూచి, దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో
లిఖించదగిన వ్యక్తి భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబు జగ్జీవన్ రామ్
అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. బాబు జగ్జీవన్ రామ్
115వ జయంతి మహోత్సవాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ
ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత వేడుకగా
నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ముఖ్య
అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ
మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ చిన్ననాటి నుంచే అనేక ఒడిదుడుకులు
అధిగమించి భారత రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించిన దార్శనికుడు శ్రీ బాబు
జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.
కేంద్ర మంత్రి పదవులను సమర్థవంతంగా నిర్వహించటమే కాకుండా ఆయా శాఖామాత్యులుగా
ఉన్న సమయంలో విప్లవాత్మక చర్యలకు నాంది పలికి తనదైన ముద్ర వేశాడని
గుర్తుచేసుకున్నారు. పేదలకు చదువు విలువ చెప్పి వారికి చదువు ఎంత ముఖ్యమో
అవగాహన కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ కే
దక్కుతుందన్నారు. నేటి తరం బాబు జగ్జీవన్ రామ్ ను స్పూర్తిగా తీసుకుని
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ బి. ఆర్.
అంబేడ్కర్, పూలే, జగ్జీవన్ రామ్ తదితరుల ఆశయాల ఆలోచనా విధానాన్ని
అందిపుచ్చుకుని జగనన్న ప్రభుత్వం రాష్ట్రంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల
అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి సమర్థవంతంగా అమలు
చేస్తుందని కొనియాడారు. కడుపులో బిడ్డ నుంచి అవ్వల వరకు ప్రతి ఒక్కరికీ
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా అందే విధంగా చర్యలు
తీసుకోవటం శుభపరిణామన్నారు.
సభకు అధ్యక్షత వహించిన విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ.మల్లాది
విష్ణువర్ధన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశ యువతకు స్పూర్తి ప్రదాత అని
ఆయన జీవిత చరిత్రను నేటి యువత తెలసుకోవాలని కోరారు. దేశంలో నాడు నెలకొన్న
వివక్షపై పోరాడిన యోధుడని కొనియాడారు. అన్ని వర్గాలను సంఘటిత పరిచిన గొప్ప
దార్శనికుడన్నారు. రాష్ట్ర క్యాబినెట్ లో సామాజిక న్యాయం పాటిస్తూ ముఖ్యమంత్రి
జగన్ మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచాడన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో సబ్
ప్లాన్ కు రూ. 20వేల కోట్లు కేటాయించటం సంతోషకరమైన విషయమన్నారు.
విజయవాడ (పశ్చిమ) శాసనసభ్యులు శ్రీ. వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ
అంటరాని తనంపై ఎక్కుపెట్టిన కత్తి చివరి వరకు దించలేదని, అంతటి మహనీయుని జయంతి
దేశ వ్యాప్తంగా జరుపుకోవటం సంతోషకరమన్నారు. మహోన్నత నాయకుల ఆలోచనలను అమలు
చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని కొనియాడారు. ఒకే నియోజకవర్గం
నుంచి 10 సార్లు ఎన్నికైన ఏకైక రాజకీయ నాయకుడు బాబు జగ్జీవన్ రాం అన్నారు.