భూపతిరాజు రవీంద్ర రాజు
విజయవాడ : గ్రేడ్ 2 వీఆర్వోలు, పదిహేను వేల రూపాయలు జీతంతో దూర ప్రాంతంలో
పనిచేస్తూ ఇబ్బందులకు గురవుతున్నందున ఈ బదిలీల్లో తప్పనిసరిగా అవకాశం
కల్పించాలని, స్పష్టమైనఆదేశాలిస్తూ బదిలీలు జూన్ 10 వరకు పొడిగించి అందరికీ
న్యాయం చేసే లాగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు
కోరారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జీవో నెంబర్ 71
ఇవ్వడం జరిగిందని, ఈనెల 22 నుంచి 31వ తారీఖు లోపు బదిలీలపై నిషేధం ఎత్తివేయడం
జరిగిందన్నారు. ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా
బదిలీలు చేయాలని, అలాగే రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి
కూడా రిక్వెస్ట్ బదిలీలకు అవకాశం కల్పించాలని విధివిధానాల ఖరారు చేస్తూ జీవో
నెంబర్ 71 ఇవ్వడం జరిగిం దని తెలిపారు. అలాగే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి
జీవో నెంబర్ 5 ద్వారా బదిలీలకు అవకాశం కల్పిస్తూ జూన్ 10 వరకు బదిలీలకు అవకాశం
ఇవ్వడం జరిగిందని, కానీ ఒకే జాబ్ చార్ట్ తో పనిచేస్తున్న మా గ్రామ రెవెన్యూ
అధికారులకు, బదిలీల్లో సరైన స్పష్టత లేకుండా ఇవ్వడంతో గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని
విభజిస్తూ జిల్లా అధికారులు బదిలీల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని
ఆవేదన వ్యకతం చేసారు.
ప్రస్తుతం గ్రేడు 2 వీఆర్వోలు బదిలీల కోసం దరఖాస్తు చేసుకుంటే మీకు బదిలీలకు
అవకాశం లేదని గ్రేడ్ 2 ఖాళీలు లేవని చెప్పడం జరుగుతుందని, అలాగే ఉమ్మడి
జిల్లాల్లో బదిలీలు చేయమని మాకు స్పష్టమైన ఆదేశాలు ఏమీ లేవని అన్ని జిల్లాల్లో
కలెక్టరేట్ సిబ్బంది చెబుతున్నారని, ఈ మధ్యకాలంలో ఉమ్మడి జిల్లాలో బదిలీలకు
అవకాశం కల్పించి ఎవరి సొంత జిల్లాలో దగ్గర మండలాల్లో వీఆర్వోలకి వారికి
బదిలీల్లో న్యాయం చేయాలని ఇప్పటికే మా గ్రామ రెవెన్యూ అధికారులసంఘం మా ఉన్నత
అధికారులైన సిసిఎల్ఏ వారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు. సీసీఎల్ ఏ
నుండి అన్ని జిల్లా కలెక్టర్లకు 71 జీవో ప్రకారం బదిలీలలో డిప్యూటీ తాసిల్దార్
లనుండి గ్రేడ్ వన్ గ్రేడ్ 2 వీఆర్వోలు అందరికీ బదిలీలకు అవకాశం ఇస్తూ మేము
జారీ చేసిన ది.24-05-2023 న.మెమో ఇవ్వడం జరిగింది. మెమో ఇచ్చిన జిల్లాస్థాయిలో
అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం తో మా గ్రామ రెవెన్యూ అధికారులు తీవ్ర
ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు గ్రేడ్ వన్ గ్రేడ్ 2 అని రాష్ట్రంలో గ్రామ
వార్డు సచివాలయాల్లో గాని, రెవెన్యూ వార్డు సెక్రటరీల్లో గాని ఎక్కడ
విడదీయలేదు. ఇప్పుడు బదిలీల విషయంలో గ్రేడ్1 వాళ్లు గ్రేడ్ 1 కి వెళ్ళాలని,
గ్రేడ్ 2 వాళ్ళు గ్రేడ్ 2,పోస్ట్ కి వెళ్లాలని చెప్పి బదిలీల్లో అవకాశం
కల్పించకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే ఈ విషయంలో
చీఫ్ సెక్రటరీ స్పష్టమైన ఆదేశాలిస్తూ ఉమ్మడి 13 జిల్లాల ప్రకారం బదిలీలకు
అవకాశం కల్పించాలని, ఎవరి సొంత జిల్లాలో వారి దగ్గర మండలాల్లో బదిలీలకు అవకాశం
కల్పించాలని కోరుచున్నాము. అలాగే మా గౌరవ సీసీఎల్ఏ వారు కూడా గ్రేడ్ 1 గ్రేడ్
2 అని భేదం లేకుండా బదిలీల కోసం కోరుకునే వారికి, వారికి కావలసిన దగ్గర
మండలాల్లో మున్సిపాలిటీలో బదిలీలకు అవకాశం కల్పించేలాగా స్పష్టమైన ఆదేశాలు
ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర
అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.
అప్పలనాయుడు కోరారు.