కొంతమంది అధికారుల తీరుతో ప్రభుత్వానికి తీవ్ర నష్టం
రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర
రాజు
విజయవాడ : బదిలీల విషయంలో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని,
రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర
రాజు అన్నారు. ప్రభుత్వం ఉద్యోగ బదిలీలకు అవకాశం కల్పించిన జిల్లా స్థాయిలో
ఉమ్మడి జిల్లాల ప్రకారం బదిలీలు చేయవలసి ఉన్నా, బదిలీ కోసం దరఖాస్తు
చేసుకున్న వారికి ఎటువంటి న్యాయం జరగడం లేదు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో
నూతనంగా ఏర్పడిన జిల్లాకు వెళ్లాలంటే అక్కడి నుండి ఇక్కడికి ఎవరైనా వస్తేనే
,అలాగే ఇక్కడ నుండి అక్కడికి ఎవరైనా వెళ్తే తప్ప బదిలీలకు, అవకాశం లేదని
జిల్లా అధికారులు చెప్పడం వల్ల చాలా జిల్లాల్లో బదిలీల కోసం ఎదురుచూస్తున్న
వారికి తీవ్ర అన్యాయం జరిగింది. అలాగే మా గ్రామ రెవెన్యూ అధికారులకు, సీసీఎల్
ఏ నుండి బదిలీల గురించి, సర్కులర్ ఇచ్చిన జిల్లా అధికారులు ఎవరూ కూడా న్యాయం
చేయడం లేదని వాపోయారు.
రాష్ట్రంలో గ్రేడ్ 1గ్రేడ్ 2 అని విఆర్వోలను, గ్రామ సచివాలయ వ్యవస్థ
వచ్చినప్పుడు, పాత వారందరినీ గ్రేడ్ 1 గా కొత్తగా సచివాలయ వ్యవస్థ ద్వారా,
విఆర్ఎ నుండి విఆర్ఓ గా వచ్చిన వారిని గ్రేడ్2గా, విభజించడం జరిగిందన్నారు.
కానీ వీరందరూ ఒకే జాబ్ చార్ట్ తో పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా
పలానా సచివాలయం గ్రేడ్ 1అని, ఫలానాసచివాలయం గ్రేడ్2 అని ఎక్కడ కూడా నోట్ ఫై
చేయలేదని, ఇప్పుడు బదిలీల విషయంలో గ్రేడ్ 1 వారు గ్రేడ్ 1 కి వెళ్ళాలని,
గ్రేడు 2 వారు గ్రేడ్ 2కెళ్లాలని చెప్పి ఎవరికీ బదిలీల్లో న్యాయం చేయకుండా
అధికారులు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ సచివాలయలద్వారా
బదిలీలకు అవకాశం కల్పిస్తే అక్కడ కూడా గ్రేడ్2 వారు బదిలీ కోసం ఆన్లైన్లో
దరఖాస్తు పెట్టుకోవాలంటే ఆ మండల పరిషత్ అభివృద్ధి అధికారి నో డ్యూస్
సర్టిఫికెట్ ఇస్తేనే గాని, బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశంలేదు.మండల
పరిషత్ అభివృద్ధి అధికారి దగ్గరికి వెళ్లి నేను బదిలీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు
పెట్టుకుంటాను. నాకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇమ్మంటే స్థానిక ప్రజాప్రతినిధులు
ఇవ్వొద్దన్నారని అధికారులు చెప్పడం జరుగుతుందన్నారు. కొంతమంది గ్రేడ్ 2
వీఆర్వోలకి మీకు ప్రొబిషన్ డిక్లేర్ అవ్వలేదని, మీకు బదిలీలకు అవకాశం లేదని
అధికారులు చెబుతున్నారని, ఇలాంటి బదిలీలు ఇవ్వడం వల్ల ఉద్యోగస్తులు తీవ్ర
అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించినా
కొంతమంది అధికారుల తీరుతో ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుందని, ప్రభుత్వం
ఇప్పుడైనా బదిలీలపై పునరాలోచించి అందరికీ న్యాయం జరిగేలా పదో తారీకు దాకా
బదిలీలు పొడిగించి న్యాయం చేయాలని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులసంఘం.
రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఎం
అప్పలనాయుడు కోరారు.
వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం దిశగా వైఎస్సార్సీపీ పరుగులు
సవాళ్లను అధిగమించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
వైఎస్సార్సీపీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి
విజయవాడ, సూర్య ప్రధాన ప్రతినిధి : వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక
ప్రకృతి వైపరీత్యాలు, అవాంతరాలు, కష్టాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారని, జనరంజక
పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత
విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం
సాధించడానికి వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
నవ్యాంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల్లో కేవలం పనితీరుతో ప్రజల మనసుల్ని
గెల్చుకునే మొదటి రాజకీయపక్షంగా వైఎస్సార్సీపీ కొత్త చరిత్రకు శ్రీకారం
చుట్టబోతోందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ,
మైనారిటీలను ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. రాజ్యసభకు నలుగురు బీసీలను
పంపించారు. ఇంకా 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎమ్మెల్సీ పదవులిచ్చారు. 56
కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ పదవులు కూడా ఇచ్చారు. గతంలో పాలకులు పేదలను
ఓటర్లుగానే చూశారు. అదే సీఎం జగన్ పాలనలో సచివాలయ, వలంటీరు వ్యవస్థలతో
ప్రజలకు ఊళ్లోను, ఇళ్లవద్దే పథకాలు అందుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో
ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని ప్రజల్లో పూర్తి విశ్వాసం కలిగించిన నేత
జగన్. తన పాలనతో అందరి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ నాలుగేళ్లలో
డీబీటీ ద్వారా రూ.2.11 లక్షల కోట్లు పైసా లంచం లేకుండా పారదర్శకంగా
లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారని, 31 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వడంతో పాటు దాదాపు
22 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తున్నారని పేర్కొన్నారు.