మహిళాపోలీసు అధికారులు దుర్భర పరిస్థితుల్లో ఉన్న తోటి స్త్రీలకు సాయపడాలి
నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో నారీశక్తి కీలక పాత్ర
హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు అమూల్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి వెళ్లిన రాష్ట్రపతి ఐపీఎస్ శిక్షణ తీసుకుంటున్న అధికారులతో సమావేశమయ్యారు. పోలీసులకు అప్రమత్తత, నిజాయితీ, సున్నితత్వం అవసరమని సూచించారు. ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని అందోళన వ్యక్తం చేశారు. పీడితులు, బలహీన వర్గాలకు పోలీసులు అండగా నిలవాలని రాష్ట్రపతి ముర్ము కోరారు. ఏ విభాగంలోనైనా మహిళల భాగస్వామ్యం సత్ఫలితాలనిస్తుందని, అన్ని విభాగాల్లో వారిని ప్రోత్సహించాలని అన్నారు. ‘‘అమృతోత్సవ కాలంలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో నారీశక్తి కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల మహిళా ఓటర్ల శాతం భారీగా పెరగడం,. భారత ప్రజాస్వామ్యం సాధించిన అతిపెద్ద విజయం. మహిళలు అన్ని విషయాల్లో దృఢంగా మారేందుకు దేశ నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం.. సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది. నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఇంగ్లాండ్ దేశాల్లోని పోలీసుల్లో 30శాతం మంది మహిళలే ఉంటారని, ఆ దేశాలు మానవాభివృద్ధి సూచికల్లోనూ మెరుగ్గా ఉన్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ సందర్శన తర్వాత మిధానీ వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడి వైడ్ప్లేట్ మిల్ని ప్రారంభించారు. అక్కడి విశేషాలను మిధానీ సీఎండీ సంజయ్‌కుమార్ ఝా రాష్ట్రపతికి వివరించారు.