హైదరాబాద్ : సుబ్బి పెళ్లి.. ఎంకి చావుకొచ్చిందన్న చందంగా మారింది ఆర్టీసీ వ్యవహారం చూస్తే. నగర శివారు డిపోల నుంచి నిత్యం సుమారు 150 బస్సుల్లో మునుగోడు నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల ఓటర్లను నగర శివార్లలోని మన్నెగూడకు తరలించేందుకు ఏర్పాటు చేయడంతో శివారు వాసులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పలు రూట్లలో రాకపోకలు సాగించేందుకు బస్సులు అందుబాటులో లేక నానా అవస్థలు పడుతున్నారు. శివారు డిపోల నుంచి ప్రతి మండలానికి నిత్యం 20– 30 బస్సులను తరలిస్తున్నట్లు తెలిసింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. ఖరీదైనదిగా మునుగోడు ఉపఎన్నిక మారిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి చెందిన వివిధ సామాజిక వర్గాలకు చెందిన వేలాది మంది ఓటర్లను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శివార్లలోని మన్నెగూడలోని కన్వెన్షన్ సెంటర్లకు తరలించి పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వ్యవహారం ఊపందుకుంది. కులాల వారీగా తాయిలాలు ప్రకటించి ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు అధికార, విపక్ష పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి.
బస్సులు లేక శివారు వాసుల అవస్థలు : గ్రేటర్ పరిధిలో 29 ఆర్టీసీ డిపోలుండగా శివారు ప్రాంతాల్లో ఉన్న బండ్లగూడ, హయత్‌నగర్–1, 2, ఇబ్రహీంపట్నం, మిధాని, ఫరూఖ్‌నగర్ తదితర డిపోలకు చెందిన 150 బస్సులు నిత్యం మునుగోడు ఓటర్లను సామాజికవర్గాల వారీగా ఆతీ్మయ సమ్మేళనం పేరిట మన్నెగూడకు తరలించేందుకు వినియోగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ నిర్ణయించిన చార్జీలు చెల్లించి ఈ బస్సులను తరలిస్తున్నట్లు ఆయా పారీ్టల నేతలు చెబుతున్నారు. నగరంలో అరకొరగా ఉన్న ఆర్టీసీ బస్సులను మునుగోడుకు తరలించడంతో నగరంలోని 1050 ఆర్టీసీ రూట్లుండగా వీటిలో 250 రూట్లలో నిత్యం 1500 ట్రిప్పులకు కోత పడుతోంది. ఈ మార్గాల్లో ప్రయాణించే వేలాది మంది సెవన్‌సీటర్ ఆటోలు,క్యాబ్‌లు ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. శివారు ఆర్టీసీ డిపోల నుంచి ఓఆర్ఆర్ పరిధిలోని 190 గ్రామాలకు రాకపోకలు సాగించే బస్సులే అధికంగా ఉన్నాయి. ఉన్నపళంగా ఈ బస్సులు మునుగోడు బాట పట్టడంతో ఆయా గ్రామాల వాసులు ఉదయం, రాత్రి వేళల్లో అవస్థలు పడుతున్నారు.