మార్కాపురం(ప్రకాశం జిల్లా) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఎర్రగొండపాలెంలోని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి థెరీసమ్మ (85) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. థెరీసమ్మ భౌతికకాయాన్ని సోమవారం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మంత్రి నివాసానికి తీసుకొచ్చారు. సాయంత్రం స్థానిక జార్జి గ్రీన్స్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు సురేష్ మంత్రికాగా రెండో కుమారుడు డాక్టర్ సతీష్ జార్జి విద్యాసంస్థల కార్యదర్శి. ఆమె అల్లుడు తిప్పేస్వామి అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే. మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసిన థెరీసమ్మ ప్రస్తుతం ఆమె భర్త డాక్టర్ శామ్యూల్ జార్జి నెలకొల్పిన విద్యాసంస్థలకు చైర్‌పర్సన్‌గా కొనసాగారు.