గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు : భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
ఆలోచన విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార,
మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం కాకుటూరులోని
విక్రమ సింహపురి విశ్వ విద్యాలయంలో కామన్ పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాణం-ప్రజాస్వామ్య వ్యవస్థ పుస్తకావిష్కరణ
కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తో కలిసి మంత్రి కాకాణి
గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సువిశాల
భారతావనికి దిశా నిర్దేశం చేసేలా పటిష్టమైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ,
పత్రికా స్వేచ్ఛ వంటి నాలుగు ప్రధాన వ్యవస్థలతో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఒక
వ్యక్తికి నిర్దిష్టమైన లక్ష్యాలు, హక్కులు కల్పిస్తూ దృఢమైన, సుస్థిరమైన
రాజ్యాంగాన్ని మన దేశానికి అందించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని, ఆయన సేవలు
చిరస్మరణీయమన్నారు. ప్రపంచ దేశాల్లో చాలావరకు రాజ్యాంగాలు నిలబడలేకపోయాయని,
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మన
దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి అంబేద్కర్ రూపొందించిన దృఢమైన
రాజ్యాంగమే కారణమన్నారు. గొప్ప వ్యక్తిత్వం గల అంబేద్కర్ ఆలోచన విధానాన్ని
నేటి తరం వారికి అర్థమయ్యేలా, ఆచరించేలా అంబేద్కరిజం మీద ఒక పుస్తకాన్ని
రూపొందించాలని కామన్ పీపుల్ ఫౌండేషన్ సభ్యులను మంత్రి కోరారు. మాజీ పార్లమెంట్
సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య
విలువలను కాపాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని
మేధావుల్లో అగ్రగణ్యుడు అంబేద్కర్ అని, ఆయన సేవలు భారత జాతి ఎప్పటికీ
మరువదన్నారు. ప్రపంచానికే మన దేశ రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
విక్రమ సింహపురి వైస్ ఛాన్సలర్ సుందరవల్లి మాట్లాడుతూ విద్యార్థులందరికీ
ఉపయోగపడేలా భారత రాజ్యాంగ నిర్మాణం- ప్రజాస్వామ్య వ్యవస్థ పై పుస్తకాన్ని
రూపొందించడం పట్ల కామన్ పీపుల్ ఫౌండేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మంత్రి సహాయ
సహకారాలతో విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. తొలుత
అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ
కార్యక్రమంలో రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయ
ప్రకాష్, కామన్ పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ దేవదాస్, సెక్రటరీ మాల్యాద్రి
తదితరులు పాల్గొన్నారు.