బెంగళూరు(కృష్ణరాజపురం): నా భార్య నాపై కత్తితో దాడి చేసింది, ఎవరైనా సాయం చేయండి అని ఓ వ్యక్తి ట్విట్టర్లో ఫిర్యాదు చేశాడు. ఇంటి గుట్టును బయటపెట్టుకున్న బాధితునిపై సానుభూతి వ్యక్తమవుతోంది. వివరాలు… యదునంద్ ఆచార్య అనే వ్యక్తి తన భార్య తనపై దాడికి పాల్పడిందని ట్విట్టర్ ద్వారా ఘోష వినిపించాడు. తనకు సహాయం అందదని, ఎందుకంటే తానొక పురుషుడనని, నారి శక్తి ప్రభావం వల్ల తన చేతికి గాయం అయిందని రక్తమోడుతున్న అరచెయ్యి ఫోటోను ట్వీట్ చేశాడు. గృహహింస కింద ఫిర్యాదు స్వీకరించాలని ప్రధాని ఆఫీసును, కేంద్ర మంత్రిని, బెంగళూరు పోలీస్ కమిషనర్ని కోరాడు. భార్య తనపై గృహ హింసకు పాల్పడుతోందని మొర పెట్టుకున్నాడు. అయితే దీనికి భౌతికంగా ఫిర్యాదు చేయాలని నగర పోలీసు కమిషనరేట్ సూచించడం విశేషం. ఆచార్య ట్వీట్‌కు రామదాస్ అయ్యర్ అనే మరో వ్యక్తి స్పందించాడు. చేతికి కట్టుకట్టిన ఫోటోను పోస్టు చేస్తూ దసరాకు తన భార్య ఇచ్చిన బహుమానం ఇది అని పేర్కొన్నాడు.