ఏం సంపాదించినా.. సాధించినా ఇండియా నుంచే..
కెనడా పౌరసత్వం ఎందుకు వదులుకోవాల్సిందో వివరణ
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెనడా పౌరసత్వం
కారణంగా తరచూ విమర్శలు ఎదుర్కొనే అక్షయ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు
సర్వస్వం భారత్ అని వివరించారు. తాను కెనడా పౌరసత్వాన్ని ఎందుకు తీసుకోవాల్సి
వచ్చిందో తెలుసుకోకుండా కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండటం తనను
బాధిస్తోందని అక్షయ్ అన్నారు.
‘ఇండియానే నాకు సర్వం.. నేను ఏం సంపాదించినా.. సాధించినా.. అన్నీ ఇక్కడి
నుంచే. పొందిన దాని నుంచి తిరిగి చెల్లించే అదృష్టం కూడా నాకు దక్కింది. కానీ,
ఏమీ తెలియకుండా కొందరు మాట్లాడే మాటలు బాధ కలిగిస్తున్నాయి’ అని అక్షయ్
తెలిపారు.
తన ఫ్రెండ్ ఒకరు కెనడాలో ఉన్నాడని, తనను అక్కడికి రమ్మన్నాడని అక్షయ్
తెలిపారు. దాంతో తాను కెనడా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నానని, అందుకే
అక్కడికి వెళ్లానని వివరించారు. ఆ సమయంలో మరో రెండు సినిమాలు మాత్రమే విడుదల
కావాల్సి ఉన్నాయని, తన లక్కు కొద్దీ తిరిగి.. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్
అయ్యాయని వివరించారు. దీంతో మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చాయని, అప్పటి నుంచి
వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత కెనడా పాస్పోర్టు
గురించి తాను మరిచిపోయినట్టు చెప్పారు. దాన్ని కచ్చితంగా మార్చుకోవాలనే ఆలోచన
కూడా రాలేదని అన్నారు. ఇప్పుడు ఆ పాస్ పోర్టును మార్చుకోవడానికి దరఖాస్తు
చేసుకున్నానని తెలిపారు. కెనడా పౌరసత్వం వదులుకుంటున్నానని స్పష్టం చేశారు.