మహోన్నత వ్యక్తి రాజ గోపాలరావు
శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం
వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : స్వర్గీయ బొడ్డేపల్లి రాజ గోపాలరావు శత జయంతి సందర్భంగా
నరసన్నపేటలో ఆ మహనీయుని విగ్రహం ఏర్పాటు చేయాలని, అందుకు తన వంతుగా లక్ష
రూపాయల విరాళాన్ని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం
జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. ప్రకటించిన విధంగానే వెంటనే
రూ.లక్ష నగదును వేదిక మీద ఉన్న నిర్వాహకులకు అప్పటి కప్పుడే అందజేశారు.
బోడేపల్లి రాజగోపాల్ రావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా
పరిషత్ సమావేశ మందిరంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి
అప్పలరాజు ముఖ్య అతిథులుగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన విశిష్ట అతిథిగా
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశం నుంచి వరుసగా
ఆరుసార్లు ఎంపీగా పనిచేసిన బొడ్డేపల్లి రాజ గోపాలరావు చిర స్మరణీయులని
చెప్పారు అతనితో కలిసి పనిచేసే అదృష్టం రాక పోయినప్పటికీ, అతని కోసం జెండా
మోసే అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామన్నారు తమ సోదరుల రాజకీయ
అభ్యున్నతికి పునాదులు వేసింది కూడా రాజగోపాల రావేనని పేర్కొన్నారు. శత జయంతి
ఉత్సవాల సందర్భంగా జిల్లాలో రెండు చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు
నిర్వాహకులు ప్రకటించడం.. అందులో ఒకటి నరసన్నపేటలో ఏర్పాటు చేయాల్సిందిగా
కోరుతూ ఆర్థిక సహాయాన్ని చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు.
మానవతావాది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులం మతం పార్టీ చూడకుండా పాటించే
సిద్ధాంతాలను స్వర్గీయ రాజ గోపాలరావు ఆ రోజుల్లోనే తు.చ తప్పకుండా పాటించే
వారని గుర్తు చేసుకున్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తరాలను చూసిన
రాజ గోపాలరావుకు సరైన గౌరవం దక్కేలా జిల్లాలో ఎంతో ప్రాధాన్యత ఉన్న వంశధార
ప్రాజెక్టుకు బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టుగా దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నామకరణం చేశారని గుర్తు చేసుకున్నారు. బి
ఆర్ ఆర్ ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, శత జయంతి ఉత్సవాలను
జిల్లా జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని కృష్ణదాస్ ఈ సందర్భంగా
పేర్కొన్నారు.