విశాఖపట్నం : ఆర్ కెబీచ్, నేవల్ కోస్టల్ బ్యాటరీ సమీపంలో ఉన్న ప్రజాపిత
బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రంలో శివరాత్రి
పర్వదినాన్ని పురస్కరించుకొని ఆశేష భక్త జనావళికి వైద్యునాధుడి దివ్యదర్శనం
కల్పిస్తున్నారు. శుక్రవారం రాత్రి గాయత్రీ విద్యాసంస్థల ఛైర్మన్ పి.సోమరాజు,
సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబులు జ్యోతి
ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వందలాది మంది భక్తులు
వైద్యనాధుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే ప్రాంగణంలో ఉన్న
జ్యోతిర్లింగాలు, వాటి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక భక్తిభావానికి సంబంధించిన అనేక
ఫోటో ప్రదర్శనలలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు
బ్రహ్మకుమారీస్ ప్రతినిధి శివలీల మాట్లాడుతూ గత ఏడాది శివరాత్రి పర్వదినాన్ని
పురస్కరించుకొని జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం
కల్పించామన్నారు. ఈ ఏడాది వైద్యునాధుడిగా పరమశివుని దర్శనం
కల్పిస్తున్నామన్నారు. మూడు రోజులు పాటు భక్తులు ఆచరించే ఉపవాస, జాగరణల
ఆధ్యాత్మిక రహస్యాలను తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు
చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం ఆ పరమశివుడి కృపగా
భావిస్తున్నట్లు సోమరాజు, శ్రీనుబాబులు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన
వైద్యునాధుడిని దర్శించుకుంటే అన్ని రోగాలు , రుగ్మతలు నయమవుతాయని కాబట్టి
శివరాత్రిరోజు ప్రతీ ఒక్కరూ ఈ దివ్యదర్శనాన్ని చేసుకోవాలని వీరు
ఆకాంక్షించారు. అనంతరం ధ్యాన మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా
బ్రహ్మకుమారీస్ ఆధ్యాత్మిక కేంద్రాన్ని అందంగా శోభాయమానంగా అలంకరించారు.