గుంటూరు : కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామాపై స్పష్టత వీడింది. పార్టీలోని
కొందరు స్థానిక నేతల వల్ల బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు కన్నా స్పష్టం
చేశారు. గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం
తీసుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సరిగాలేదని ఆరోపిస్తూ ఆ పార్టీకి
కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన
దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా గురువారం ఉదయం తన ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు.
పార్టీ మార్పుపై వారితో చర్చించాక మీడియా సమావేశం ఏర్పాటు చేసి, బీజేపీకి
రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు అనుచరులు కూడా పార్టీకి
రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే ప్రకటన చేస్తానని కన్నా
లక్ష్మీనారాయణ చెప్పారు.
2014లో నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ఆకర్షింపబడి బీజేపీలో చేరినట్లు ఆయన
వెల్లడించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో పార్టీని పటిష్ఠం
చేయడానికి సామాన్య కార్యకర్తలాగా పనిచేశానని ఆయన చెప్పారు. తన పనితీరు చూసి
అధిష్ఠానం 2018లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిందని తెలిపారు. తాను
బాధ్యతలు తీసుకున్న ఏడాదికే.. అంటే 2019లో ఎన్నికలు వచ్చాయని చెప్పారు.
అయినప్పటికీ సాధ్యమైనంత మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించి
పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచారం చేశానని కన్నా వివరించారు.
కోవిడ్ తర్వాత తనను తప్పించి సోము వీర్రాజుకు పార్టీ అధ్యక్ష పదవి
అప్పగించారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అప్పటి నుంచి రాష్ట్రంలో పగలు,
కక్ష సాధింపు చర్యలపైనే పార్టీ నేతలు దృష్టి సారించారని ఆరోపించారు. స్థానిక
నాయకులకు డబ్బు సంపాదనే లక్ష్యంగా మారిందని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను
పట్టించుకోవట్లేదని విమర్శించారు. రాష్ట్ర నాయకత్వం తీరు సరిగ్గాలేదని
మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో స్థానిక నేతల మధ్య ఇమడలేక పార్టీకి రాజీనామా
చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీపై ఉన్న అభిమానం మాత్రం చెరిగిపోయేది
కాదని ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
ఇక కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపై స్పందించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు ఎవరూ
ముందుకు రాలేదు. బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్ కూడా మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ
విషయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తేల్చిచెప్పారు. మీరు చెబితేనే నాకా
విషయం తెలిసిందంటూ మీడియా ప్రతినిధులతో కామెంట్ చేశారు. పూర్తి వివరాలు
తెలిశాక పార్టీ అధిష్ఠానం నుంచి స్పందన ఉంటుందని జీవీఎల్ పేర్కొన్నారు.