విజయవాడ : దేశంలో మోడీ అరాచకాలను ఎదుర్కొనే సత్తా ఉన్న ఏకైక నేత రాహుల్ గాంధీ
అని పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. విజయవాడలోని
కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ అక్రమాలు, అరాచకాలకు వ్యతిరేకంగా జులై 12వ తేదీ
విజయవాడలోని ధర్నాచౌక్ లో మౌన సత్యాగ్రహం చేపట్టినట్లు ఈ సందర్భంగా గిడుగు
రుద్రరాజు స్పష్టం చేశారు. అదానీ అక్రమ, ఆర్థిక లావాదేవీలపై జాయింట్
పార్లమెంటరీ కమిటీ (జే పీ సీ) వేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసినా ఇంత వరకూ
దానిపై ఎటువంటి స్పందనా లేదన్నారు. అమెరికా దేశానికి చెందిన దర్యాప్తు సంస్థ
కూడా అదానీ ఆర్థికపరమైన అక్రమాలపై తగు ఆధారాలతో పూర్తిస్థాయిలో నివేదిక విడుదల
చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అధికారాన్ని అడ్డు పెట్టుకుని : ప్రజాస్వామ్యం సాక్షిగా, ప్రజలు ఇచ్చిన
అధికారాన్ని అడ్డం పెట్టుకుని మోడీ, అమిత్ షా లు చేసిన దోపిడీ లు, దురాగతాలు
బయట పెడుతున్నారన్న కోపం తోనే ప్రజానేత రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు
బనాయిస్తున్నారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. అదే విధంగా
కేసుల నుంచి ఉపశమనం లభించకుండా కోర్టులలో కూడా అడ్డుకుంటున్నట్లు ఆయన అనుమానం
వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యులపై
కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సోనియాగాంధీ ని కూడా విచారణ
పేరుతో వేధింపులకు గురి చేయడం హేయమైన చర్య అన్నారు. అదే విధంగా దేశంలోని యు పీ
ఏ భాగస్వామ్య పక్ష నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇతర
కాంగ్రెస్ ముఖ్య నేతలను కూడా ఈడీ విచారణ పేరుతో టార్గెట్ చేస్తున్నారని గిడుగు
రుద్రరాజు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పై మోడీ, అమిత్ షా ద్వయం
చేస్తోన్న దాడి ని ఖండిస్తూ, ప్రజానేత రాహుల్ గాంధీ కి సంఘీ భావంగా ఈ నెల 12వ
తేదీ విజయవాడలో చేపట్టిన మౌన సత్యాగ్రహం లో ప్రజలు, కాంగ్రెస్ వాదులు అందరూ
పాల్గొని తమ మద్ధతు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్
పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి ముఖ్య
నాయకులు అందరూ పాల్గొంటారని తెలిపారు. పత్రికా సమావేశంలో రాష్ట్ర
కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్
గుర్నాధం, విజయవాడ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరి శెట్టి నరసింహారావు,
కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తాంతియా కుమారి, ఏఐసీసీ కమిటీ
సభ్యులు కొలనుకొండ శివాజీ, రాష్ట్ర లీగల్ సెల్ వైస్ ఛైర్మన్ డాక్టర్ జంధ్యాల
శాస్త్రి పలువురు నేతలు పాల్గొన్నారు.