ఈ నెలాఖరులోగా ప్రధాన పార్టీలు స్పందించకుంటే ప్రత్యేక రాజకీయ వేదిక
భవిష్యత్తు కార్యాచరణ కోసం నేడు ప్లీనరీ
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీసీనే సీఎం అభ్యర్థిగా పెడతామని రాజకీయ పార్టీలు
తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. 60 మంది బీసీలకు చట్టసభల్లో ప్రవేశం
కల్పించేలా ఈ నెలాఖరులోగా ప్రధాన పార్టీలు బీసీ రాజకీయ విధానాన్ని
ప్రకటించాలన్నారు. లేకుంటే ఆగస్టు మూడో వారంలో 5 లక్షల మందితో బీసీ సింహగర్జన
నిర్వహించి, తామే ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వచ్చే
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీల రాజకీయ సాధికారత, భవిష్యత్తు కార్యాచరణ
కోసం శనివారం హైదరాబాద్ కేబీఆర్ కన్వెన్షన్ (ఎల్బీనగర్ సమీపంలో)లో బీసీ
మేధావులు, సామాజిక కార్యకర్తలతో కలిసి ‘బీసీల రాజకీయ ప్లీనరీ’
నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. బీసీలకు
కావాల్సింది గొర్రెలు, బర్రెలు, సంక్షేమ పథకాలు కాదని, రాజ్యాధికారం
దక్కాలన్నారు. బీసీ రాజకీయ విధానం ప్రకటించాలని కోరుతూ ఈ నెలలో అన్ని రాజకీయ
పార్టీల అధ్యక్షులను కలిసి వినతిపత్రాలు ఇస్తామన్నారు.
రాష్ట్రంలో బీసీల రాజకీయ శక్తి చాటిచెప్పేందుకు ప్లీనరీ నిర్వహిస్తున్నాం.
ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు బీసీలను పావులుగా వాడుకుంటున్నాయి. అధికారంలోకి
వచ్చాక అంటరానివారిగా చూస్తున్నాయి. బీఎస్పీ, ఇతర పార్టీలు జనాభా ప్రాతిపదికన
బీసీలకు సీట్లు ఇస్తామని చేస్తున్న ప్రకటనల్ని స్వాగతిస్తున్నాం. ప్రధాన
పార్టీలు బీసీల రాజకీయ విధానాన్ని ఎందుకు ప్రకటించడం లేదు. రాజకీయ ప్లీనరీ
ద్వారా బీసీలకు సామాజిక న్యాయం దక్కేలా సామాజిక శక్తులు, మేధావులను ఏకం చేస్తూ
ముందుకు వెళ్తాం. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలు రాగానే బీసీ డిక్లరేషన్
పేరిట మోసం చేస్తున్నాయి. బతుకులు మారాలన్నా, ఆత్మగౌరవం పెరగాలన్నా బీసీలకు
పరిపాలన అధికారం దక్కాలి. దేశంలో అన్నివర్గాలకు జనాభా ప్రాతిపదికన విద్య,
ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన
విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు అమలు కావడం లేదు. ఆగస్టు 7న
దేశవ్యాప్తంగా ‘మహామండల్ ఉద్యమం’ చేయాలని కార్యాచరణ రూపొందిస్తున్నాం.
రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన తొమ్మిది మంది బీసీ మంత్రులు ఉండాలి. కానీ,
ముగ్గురే ఉన్నారు. బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కేంత
వరకు ఉద్యమించాలని నిర్ణయించాం అన్నారు.