హైదరాబాద్ : బీసీల సంక్షేమం కోసం జాతీయస్థాయిలో వెంటనే ప్రత్యేక బీసీ
మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాజ్యసభసభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం
అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు
ప్రధాని నరేంద్ర మోడీ కి ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు. జనాభాలో 56శాతంగా ఉన్న
బీసీలకు స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు బీసీలకు ప్రత్యేక
మంత్రిత్వశాఖ లేకపోవడం అత్యంతదారుణమన్నారు.
మంత్రిత్వ శాఖ లేకపోవడంతో బీసీలు విద్యా, ఆర్థిక రంగాల్లో తీవ్ర
నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీలకు
ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నామని
కోరారు. అదీగాక ఇప్పటికే కేంద్రం బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 27శాతాన్ని
కేటాయిస్తున్నాయని, నేషనల్ బీసీ కమిషన్‌తోపాటు, కార్పొరేషన్, ప్రత్యేక
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఏర్పాటైందని గుర్తుచేశారు. బీసీలకు ప్రత్యేక
మంత్రిత్వశాఖ ఏర్పాటు కూడా చారిత్రక అవసరమన్నారు. సంక్షేమ పథకాల అమలు, విద్యా,
ఉద్యోగాల్లో బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు, పోస్ట్, ప్రీమెట్రిక్
స్కాలర్‌షిప్‌ల అమలులో అనేక న్యాయసంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు.
ఎస్సీల రిజర్వేషన్ 15శాతం, గిరిజనులకు 7శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నా
ప్రత్యేక మంత్రిత్వశాఖలను ఏర్పాటు చేశారని, కానీ 27శాతం రిజర్వేషన్‌ను
పొందుతున్న బీసీలకు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.
ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖలను ఏర్పాటు
చేశాయని గుర్తుచేశారు. ఇప్పటికైనా బీసీలకు జాతీయస్థాయిలో ప్రత్యేక
మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే చర్యలు
చేపట్టాలని డిమాండ్ చేశారు.