విజయవాడ : బీసీలలోని మొత్తం 139 కులాలను ఏదైన ఒక వేదిక మీద, ఒక్క చోట అందరినీ
చూడాలని తనకు కోరికగా ఉండేదని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
పేర్కొన్నారు. ఈరోజు ఆ కోరికను కారణజన్ముడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
తీర్చాడని, తనకు చాలా సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. విజయవాడలో జరుగుతున్న
జయహో బీసీ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సభలో ఉన్నవాళ్లలో మొత్తం 139
కులాలకు చెందిన వారు ఉన్నారని మంత్రి ఆయా కులాల పేర్లను ప్రస్తావించారు. ఈ
కులాలను ఏకం చేసిన గొప్ప నేత ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. బీసీ కులాలకు
రాజకీయ ప్రాధాన్యం ఇచ్చిన గొప్పనేత వైఎస్ జగన్ అని మంత్రి వేణుగోపాల్
చెప్పారు. ఎన్నికలలో గెలిచే సామర్థ్యం ఉన్న నేతలకు వార్డు మెంబర్ నుంచి
ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లిచ్చి, గెలవలేరనుకునే అభ్యర్థులకు పదవులు
కట్టబెట్టారని.. జయహో జగనన్న అంటూ మంత్రి నినదించారు. బీసీ సంక్షేమ శాఖ
మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన జగన్ కు సభాముఖంగా కృతజ్ఞతలు
తెలియజేసుకుంటున్నానని మంత్రి వేణుగోపాల్ చెప్పారు. ఈ సందర్భంగా మాజీ
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి విమర్శలు గుప్పించారు. పూర్వం
ఒకాయన చంద్రబాబు దగ్గరికి వెళ్లి గంజి గురించి చెప్పండని అడిగితే.. ‘పేదోడి
పొట్టకు, ఉన్నోడి బట్టకు వాడతారు’ అని చంద్రబాబు జవాబిచ్చాడని వివరించారు.
బీసీ కులాలను బట్టలకు వాడాడాని చంద్రబాబును మంత్రి వేణుగోపాల్ విమర్శించారు.
పేదల కష్టాలను తీర్చడానికి విష్ణుమూర్తి ఈ కాలంలో జగన్మోహన అవతారమెత్తి మన
కులాలందరినీ కాపాడుతున్నాడని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ను
విష్ణుమూర్తి అవతారంగా మంత్రి పోల్చారు.