ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంపై ఓలా దృష్టి సారించింది. ఇందులో భాగంగా కస్టమర్లు ఆర్డర్ చేసిన రెండు మూడు రోజుల్లోనే వారికి స్కూటర్ డెలివరీ చేయనుంది. వచ్చే వారం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు సంస్థ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ ట్విట్టర్ పై ప్రకటించారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోని కస్టమర్లకు బుక్ చేసిన రోజే డెలివరీ చేస్తామని చెప్పారు. ఇతర ప్రాంతాల వారికి రెండు మూడు రోజులకే అందిస్తామని తెలిపారు. పట్టణాల వారీ డెలివరీ సమయం అన్నది వేర్వేరుగా ఉండనుంది. ఓలా ఎక్స్ పీరియన్స్ కేంద్రాలకు వెళ్లి, లేదంటే ఆన్ లైన్ లోనూ, లేదంటే టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు. ఓలా ఇటీవలే ఒక లక్ష యూనిట్ లను ఉత్పత్తి చేయడం ద్వారా దేశంలోనే వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న సంస్థగా నిలిచింది. తమిళనాడులోని ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో దీన్ని తయారు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థ 70వేల స్కూటర్లను విక్రయించింది. ప్రస్తుతం ఈ సంస్థ ఓలా ఎస్ 1 (రూ.99,999), ఎస్ 1 ప్రో (రూ.1,39,999), ఎస్1 ఎయిర్ (రూ.84,999) పేరుతో మూడు స్కూటర్లను విక్రయిస్తోంది.