ప్రధాని నరేంద్ర మోడీ
భారత్-అమెరికా భాగస్వామ్యం 21వ శతాబ్దంలో ప్రపంచ భవిష్యత్తును మార్చగలదని
ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి అని, అమెరికా
ప్రజాస్వామ్యానికి ఛాంపియన్ అన్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన
ప్రసంగించారు. ఇక నుంచి హెచ్ 1 బీ వీసా పునరుద్ధరణ అమెరికాలోనే చేసుకోవచ్చని
ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మరోవైపు భారత్-అమెరికా సంబంధాల బలోపేతానికి
ప్రధాని నరేంద్ర మోడీ నిబద్ధతతో పనిచేస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా
హారిస్ తెలిపారు.
భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి
అమెరికా ఆధునిక ప్రజాస్వామ్యానికి ఛాంపియన్ అని ప్రధాని నరేంద్ర మోడీ
తెలిపారు. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల బంధం బలపడడాన్ని ప్రపంచం
గమనిస్తోందని ప్రధాని అన్నారు. 21వ శతాబ్దంలో భారత్-అమెరికా భాగస్వామ్యం
ప్రపంచ భవిష్యత్తును మరింత మార్చగలదని అభిప్రాయపడ్డారు. అమెరికా పర్యటనలో
భాగంగా నరేంద్ర మోడీ ప్రవాస భారతీయులను ఉద్దేశించి శుక్రవారం(అమెరికా కాలమానం
ప్రకారం) ప్రసంగించారు. ప్రవాస భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పారు ప్రధాని మోడీ.
ఇక నుంచి హెచ్ 1 బీ వీసా పునరుద్ధరణ అమెరికాలో చేసుకోవచ్చని ప్రధాని నరేంద్ర
మోడీ అన్నారు.
అమెరికా కొత్త కాన్సులేట్లు బెంగళూరు, అహ్మదాబాద్‌లలో త్వరలో తెరుస్తారు.
హెచ్ 1బీ వీసా పునరుద్ధరణ అమెరికాలోనే చేసుకోవచ్చు. భారత్‌లో యుద్ధ విమానాలను
తయారు చేసేందుకు జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ తీసుకున్న నిర్ణయం భారత రక్షణ రంగంలో
మైలురాయిగా నిలుస్తుంది. భారత్-యూఎస్ మధ్య కుదిరిన ఆర్టెమిస్ ఒప్పందం అంతరిక్ష
పరిశోధనలో అనేక అవకాశాలను అందిస్తుంది. నాసాతో కలిసి భారత్ అంతరిక్షంలోకి
వ్యోమగాములను పంపుతుంది. యూఎస్‌లో నేను పొందుతున్న ప్రేమ అద్భుతం. క్రెడిట్
అంతా అమెరికా ప్రజలకే చెందుతుంది.
వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్‌లో సభకు హాజరైన ప్రజలను చూసి ఈ హాలులో
భారతదేశం పూర్తి మ్యాప్‌ను చూసినట్లు ఉందని అన్నారు. అమెరికా నలుమూలల నుంచి ఈ
సభకు హాజరయ్యారని ప్రశంసించారు.
మోడీ కి కమలా హారిస్ విందు
అమెరికా పర్యటనలోఉన్న ప్రధాని నరేంద్ర మోడీ కి ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా
హారిస్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె భారత్‌పై ప్రశంసలు కురిపించారు.
భారత్-అమెరికా సంబంధాల బలోపేతానికి ప్రధాని నరేంద్ర మోడీ నిబద్ధతతో
పనిచేస్తున్నారని కమలా హారిస్ తెలిపారు. మోదీ, బైడెన్ హయాంలో ఇరుదేశాల
సంబంధాలు ఉన్నత స్థాయికి చేరాయని ఆమె తెలిపారు. భారతదేశ చరిత్ర, బోధనలు
ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు.
భారత్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆమె అన్నారు. 21వ శతాబ్దంలో భారత్.. ప్రపంచ
శక్తిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ కి కమలా
హారిస్ ధన్యవాదాలు తెలిపారు. తన పర్యటన వల్లభారత్- అమెరికా మధ్య స్నేహం,
సహకారం మరింత బలోపేతం అవుతుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పలు రంగాల్లో
అమెరికా, భారత్ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. కమలా హారిస్ సాధించిన ఘనత
అమెరికాకే కాదు. మహిళలందరికీ స్ఫూర్తి అని చెప్పారు. అలాగే కమలా హారిస్‌పై
ప్రశంసలు కురిపించారు.
సీఈఓలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ
భారత్ నైపుణ్యాలు, అమెరికా అధునాతన సాంకేతికత కలిస్తే ప్రపంచానికి మరింత
మెరుగైన భవిష్యత్‌ను అందించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికా
పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలో రెండు దేశాలకు చెందిన దిగ్గజ
సంస్థల సీఈఓలతో ప్రధాని మోదీ ముచ్చటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్ సిఈఓ టిమ్ కుక్, గూగుల్ సిఈఓ సుందర్
పిచాయ్, ఓపెన్ ఏఐ సిఈఓ శామ్ ఆల్ట్‌మన్, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ వంటి
అమెరికా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు.