చేయకపోతే తాము ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనేదే లేదని రెజ్లర్లు తేల్చిచెప్పారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన గడువులోగా తమ సమస్య పరిష్కారం కాకపోతే
ఆందోళన ఉద్ధృతం చేస్తామని తెలిపారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు,
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన భారత
అగ్రశ్రేణి రెజ్లర్లు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. తమ డిమాండ్లు
పరిష్కారమైతేనే ఈ ఏడాది జరగబోయే ఏషియన్ గేమ్స్‌లో పాల్గొంటామని, లేదంటే
వాటిని బహిష్కరిస్తామని హెచ్చరించారు.
హరియాణాలోని సోనిపట్‌లో జరిగిన ఖాప్ నేతలు నిర్వహించిన మహా పంచాయత్‌లో
రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పునియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాక్షి
మలిక్ మాట్లాడారు. “ఈ సమస్యలన్నీ పరిష్కారమైతేనే మేం ఏషియన్ గేమ్స్‌లో
పాల్గొంటాం. మేం ప్రతిరోజూ మానసికంగా ఎంతటి వేదన అనుభవిస్తున్నామో మీకు అర్థం
కాదు” అని అన్నారు. ఆందోళన చేస్తున్న రెజ్లర్ల మధ్య ఐక్యత లోపించిందంటూ
వస్తున్న వార్తలను సాక్షి మలిక్ తోసిపుచ్చారు. తామంతా ఒక్కటే అని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ కలిసికట్టుగా
ఆందోళనకు దిగుతామని పేర్కొన్నారు.బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఇటీవల రెజర్లు
దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొన్ని రోజుల పాటు దీక్ష చేపట్టారు. వీరి ఆందోళన
ఇటీవల ఉద్ధృతమవడంతో స్పందించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్
వారితో చర్చలు జరిపారు. బ్రిజ్ భూషణ్‌పై ఈ నెల 15 లోగా ఛార్జ్‌షీట్ దాఖలు
చేస్తామని, జూన్ 30 లోగా డబ్ల్యూఎఫ్ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం
హామీ ఇచ్చారు. దీంతో రెజ్లర్లు తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు.
అయితే రెజ్లర్ల ఫిర్యాదుతో బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు
ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వాటిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ
జరుపుతోంది. ఇప్పటివరకు 180కి పైగా మందిని విచారించారు. ఇందులో భాగంగానే
శుక్రవారం ఆయన ఇంటి వద్దకు ఓ మహిళా రెజ్లర్‌ను తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్
చేయించారు. ఈ కేసులో త్వరలోనే సిట్ బృందం దర్యాప్తు నివేదికను కోర్టుకు
సమర్పించనుంది.ఇటీవలే బ్రిజ్ భూషణ్‌పై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో
కీలక పరిణామం జరిగింది. బ్రిజ్ భూషణ్‌పై తప్పుడు ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు
చేశారని మైనర్ బాలిక తండ్రి వెల్లడించారు. తాము ఉద్దేశపూర్వకంగా ఆయనపై
తప్పుడు కేసు పెట్టామని మైనర్ రెజ్లర్ తండ్రి అంగీకరించారు. గతేడాది ఆ బాలిక
ఒక పోటీకి భారత జట్టు తరఫున ఎంపిక కాలేదన్న అక్కసుతోనే సింగ్‌పై లైంగిక
వేధింపుల ఆరోపణలను చేసినట్లు ఒక వార్తాసంస్థకు తెలిపారు.