లండన్ : ఉత్తర ఇంగ్లాండ్‌లో పర్యటించిన బ్రిటన్ రాజు ఛార్లెస్-3 దంపతులకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. రాజు కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఓ నిరసనకారుడు వారిపై గుడ్లను విసరడం కలకలం రేపింది. బ్రిటన్ రాజు ఛార్లెస్-3 దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఛార్లెస్ దంపతులపై ఓ వ్యక్తి గుడ్లతో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసే రాజు ఛార్లెస్-3 ఈసారి మాత్రం తదేకంగా చూస్తూ ఉండిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని యార్క్ నగరంలో జరిగిన ఓ సంప్రదాయ వేడుకలో రాజు ఛార్లెస్-3, సతీమణి కెమిల్లాతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేడుకకు హాజరైన పౌరులతో కరచాలనం చేస్తూ వారిని పలుకరిస్తూ ముందుకు సాగారు. అదే సమయంలో జనసమూహంలో ఉన్న ఓ వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఛార్లెస్‌పై గుడ్లు విసిరాడు. ఊహించని పరిణామంతో దంపతులిద్దరూ కొద్దిసేపు అక్కడే నిలబడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్-2 ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం బ్రిటన్ నూతన రాజుగా ఛార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు. రాజు హోదాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఛార్లెస్‌కు ఇంగ్లాండ్‌లో ఇలా ఊహించని అనుభవం ఎదురైంది.