విజయవాడ : బ్రిటీష్ వారిపై జరిపిన స్వాతంత్ర్య పోరులో ఆంధ్రప్రాంతం నిర్ణయాత్మక పాత్ర పోషించిందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజ్‌భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ హరిచందన్ అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు అగ్రగామిగా నిలిచారన్నారు. 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న తుది శ్వాస విడిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన అత్యున్నత త్యాగం తరువాతే భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆంధ్ర ప్రాంత ప్రజల డిమాండ్ తీవ్రస్థాయికి చేరుకుందన్నారు. భాషా ప్రాతిపదికన దేశంలో ఏర్పాటైన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందారన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాష్ , ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.