బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో తన ప్రత్యర్థి వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇన్సియో లులా డా సిల్వా (77) చేతిలో బోల్సోనారో ఓటమిపాలయ్యారు. దీంతో లులా బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా గెలుపొందినట్లయింది. స్వల్ప తేడాతోనే బోల్సోనారో పరాజయం పొందారు. ఇరువురి మధ్య జరిగిన హోరాహోరీ పోరులో బోల్సోనారోపై లులా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో లులాకు 50.9 శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు బోల్సోనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికతో లులా డా సిల్వా బ్రెజిల్ అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 2003 నుంచి 2010 వరకు ఆయన ప్రెసిడెంట్గా చేశారు. సరిగ్గా 20 ఏళ్ల కిందట తొలిసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డా సిల్వా అధికారం కోల్పోయిన తర్వాత అవినీతి ఆరోపణలతో జైలుకు కూడా వెళ్లారు. మళ్లీ బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా గెలిచారు. ఆయన 2023 జనవరి 1న బ్రెజిల్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.