తిరుమల : భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం ఉదయం టీటీడీ చేపట్టిన శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం భక్తిభావాన్ని పంచింది. పలువురు భక్తులు నేరుగా పాల్గొనగా, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది భక్తులు తమ ఇళ్లలోనే పారాయణం చేశారు. టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు శ్రీమాన్ కోగంటి రామానుజాచార్యులు, శ్రీ మారుతి, శ్రీ అనంత గోపాలకృష్ణ అఖండ పారాయణం చేశారు. మొదట శ్రీ గురు ప్రార్ధనతో సంకల్పం చెప్పారు. ఆ తరువాత విష్ణు సహస్రనామ స్తోత్రం 108 శ్లోకాలను మూడు సార్లు పారాయణం చేశారు.
కాగా, శ్రీ భీష్మాచార్యులు శ్రీ విష్ణు సహస్రనామాన్ని శ్రీ ధర్మరాజుకు వివరించగా శ్రీమహావిష్ణువు ఆమోదించారని, ఈ పారాయణం వల్ల విశేష ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి కవిత బృందం “అని యానతిచ్చె కృష్ణుడర్జునునితో…” తదితర కీర్తనలను చక్కగా ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ధర్మగిరి వేద పాఠశాల, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ, కంచి కామకోటి పీఠం వేద పాఠశాలకు చెందిన వేద పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు.