కార్పొరేషన్ ఉద్యోగులకు గుర్తింపు కార్డుల జారీ ప్రారంభం
తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను భగవంతుడితో సమానంగా
చూడాలని, వారితో గౌరవ మర్యాదలతో వ్యవహరించి మెరుగైన సేవలు అందించాలని టిటిడి
జెఈవో సదా భార్గవి కార్పొరేషన్ ఉద్యోగులను కోరారు. టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ
లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ లో చేరిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు
గుర్తింపు కార్డుల జారీని జెఈఓ ప్రారంభించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి
విశ్రాంతి గృహంలో శనివారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ
విభాగాలకు చెందిన దాదాపు 30 మంది కార్పొరేషన్ ఉద్యోగులకు జెఈఓ చేతుల మీదుగా
గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ టిటిడిలో వివిధ
సొసైటీల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనం ఇతర సౌకర్యాలు
కల్పించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అప్పటి ఈవో
జవహర్ రెడ్డి, ప్రస్తుత ఈవో ఎవి.ధర్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో కార్పొరేషన్
ఉద్యోగులకు మేలు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ఆర్జిత
సెలవులు వర్తింపచేశామని, ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే రూ.5 లక్షల
ఇన్సూరెన్స్ కల్పించామని, గ్రాట్యూటీ చెల్లిస్తామని తెలియజేశారు. అదేవిధంగా
గుర్తింపు కార్డుతో సుపథం మార్గం ద్వారా కుటుంబ సమేతంగా శ్రీవారిని
దర్శించుకునే అవకాశం కల్పించామని, రూ.20 చొప్పున నెలకు 10 లడ్డూలు సబ్సిడీపై
పొందే అవకాశం ఇచ్చామని తెలియజేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం ఇటీవల వేతనాలు
పెంచామన్నారు. నెలకు రూ.1000 అద్దెతో క్వార్టర్స్ కేటాయించామని, త్వరలో వీటికి
మరమ్మతులు పూర్తి చేసి ఉద్యోగులకు అందిస్తామని తెలియజేశారు. కార్పొరేషన్ సీఈఓ
శేష శైలేంద్ర మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం టిటిడి
యాజమాన్యం ఎంతో ఉన్నతంగా ఆలోచించి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. టిటిడికి
అవసరమైన అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఇకపై కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేసి
అందజేస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతినెలా ఒకటో తేదీలోపే ఉద్యోగుల
బ్యాంకు ఖాతాల్లో వేతనాల సొమ్ము జమ చేస్తున్నట్టు తెలిపారు. కార్పొరేషన్
ఉద్యోగులు క్రమశిక్షణతో నిజాయితీగా పనిచేసి సంస్థకు మంచి గుర్తింపు
తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిటిడి పిఆర్ఓ డా. టి.రవి, కార్పొరేషన్
సిబ్బంది పాల్గొన్నారు.