రాజమండ్రి : మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పెద్ద విమానాశ్రయంగా రాజమండ్రి
మధురపూడి విమానాశ్రయం ఆవిష్కృతం కానుందని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్
విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. శుక్రవారం ఆయన మధురపూడి
విమానాశ్రయాన్ని సందర్శించారు. ఈ విమానాశ్రయానికి టర్మినల్ బిల్డింగ్ తదితర
అభివృద్ధి పనులకు గాను రూ. 347.15 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన
విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ భరత్ రాజమండ్రి విమానాశ్రయం అధికారులతో
అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టర్మినల్
బిల్డింగ్ శాంక్షన్ నిమిత్తం పార్లమెంటులోను, బోర్డు మీటింగ్ లోను పదేపదే
వత్తిడి చేసిన మీదట ఈ నిధులు మంజూరయ్యాయన్నారు. గతంలోనే ఈ ప్రతిపాదన ఉన్నా
సరైన కృషి చేయలేదని చెప్పారు. తాను కేంద్ర మంత్రి జ్యోతీరావు సింథియా దృష్టికి
తీసుకువెళ్ళడంతో పాటు కొత్తగా వచ్చిన ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సహకారంతో
ప్రతిపాదనతో తన కృషి ఫలించిందని చెప్పారు. మన ఏపీలో ఆరు విమానాశ్రయాలు ఉండగా
వాటిలో ప్రధానమైనవి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి అన్నారు.
విజయవాడ, విశాఖ, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కాగా, రాజమండ్రి
విమానాశ్రయం కేవలం డొమెస్టిక్ పర్పస్ కు మాత్రమే అన్నారు. మన ఉభయ గోదావరి
జిల్లాల జనాభా సుమారు కోటిన్నరకు పైగా ఉన్నారని, అందుకు తగ్గట్టు ఇక్కడ
ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేయాలనేదే తన లక్ష్యమన్నారు. రాజమండ్రి
విమానాశ్రయం రన్ వే 3.8 కిలోమీటర్లని, రాష్ట్రంలో అతి పెద్ద రన్ వే ఇక్కడే
ఉందని చెప్పారు. తమ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే క్లాస్ ఫోర్
ఎయిర్పోర్ట్ గా కన్వర్ట్ చేసినట్టు చెప్పారు. భవిష్యత్తులో ప్రయాణికుల
సౌకర్యాలను, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫైవ్ ఏరో బ్రిడ్జెస్ ఉండే పెద్ద
టర్మినల్ బిల్డింగ్ నిర్మించబోతున్నట్టు ఎంపీ భరత్ తెలియజేశారు. తొలుత రూ.170
కోట్లతో పనులు చేపట్టే ఆలోచనలతో అధికారులు ఉన్నారన్నారు. ఒకేసారి అయిదు పెద్ద
విమానాలు వచ్చినా డైరెక్ట్ గా టర్మినల్ బిల్డింగ్ కు అటాచ్ అయ్యేలా ఈ
టెర్మినల్ ఉపయోగపడుతుందని ఎంపీ వివరించారు. అలాగే 1400 మంది ప్రయాణికులకు
సౌకర్యవంతంగా ఈ టెర్మినల్ బిల్డింగ్ ఉండబోతోందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న
టెర్మినల్ బిల్డింగ్ ను అరైవల్ కు, కొత్తగా నిర్మించబోయే టెర్మినల్ బిల్డింగ్
డిపాశ్చర్ కు రెండింటినీ ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. అలాగే ఎయిర్ బస్ 320
వచ్చేందుకు కృషిచేస్తున్నట్టు తెలిపారు. మొన్ననే ఇండిగో ట్రైల్ రన్ చేసినట్టు
చెప్పారు. బొంబాయి, ఢిల్లీ, కలకత్తా కనెక్టివిటీ ఉండేలా వన్ స్టాప్ ఫ్లైట్స్,
లేదా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ తెలిపారు.