ప్రతిఏటా కూడా ఈ ఆటల పోటీలు నిర్వహించాలి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో క్రీడలు, యువజన
సర్వీసుల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో క్రీడలు,
యువజన సర్వీసులశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో
రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతీ
ఏటా ఈ ఆటల పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. అంబటి రాయుడు, కేఎస్ భరత్
సేవలను మనం వినియోగించుకోవాలన్నారు. పోటీల కోసం ప్రతీ మండలంలో క్రీడా
మైదానాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామం/వార్డు, మండల, నియోజకవర్గం,
జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు.
క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబాడీ, ఖో–ఖో పోటీలు నిర్వహిస్తారు.
బాలురు, బాలికలకు పోటీలతో పాటుగానే, 3 కి.మీ మారథాన్, యోగా, టెన్నీకాయిట్,
సంప్రదాయ ఆటల పోటీలు ప్రభుత్వం నిర్వహించనుంది. సచివాలయాల స్థాయిలో మొదలుకుని,
మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. మొత్తం
46 రోజులపాటు ఆటలు కొనసాగుతాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ గ్రౌండ్లు,
మున్సిపల్ స్టేడియంలు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూనివర్సిటీ
గ్రౌండ్లు తదితర మైదానాల్లో పోటీలు జరుగనున్నాయి.
సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిఏటా కూడా ఈ ఆటల పోటీలు నిర్వహించాలి. క్రికెట్
లాంటి ఆటలో సీఎస్కే మార్గదర్శకం చేస్తుంది, నిర్వహణలో పాల్గొంటారు.
భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ లాంటి జట్టు సహాయం కూడా తీసుకుంటాం. ప్రస్తుతం
చెన్నై సూపర్‌కింగ్స్‌కు మూడు క్రికెట్ స్టేడియంలలో శిక్షణ కార్యక్రమాలు
అప్పగిస్తాం. భవిష్యత్తులో ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్ టీం దిశగా
ముందుకుసాగాలి. దీనివల్ల ప్రొఫెషనలిజం బాగా పెరుగుతుంది. అంబటిరాయుడు, కేఎస్
భరత్ లాంటి వాళ్లు రాష్ట్రంలోని యువకులకు స్ఫూర్తిదాయకులు. వీరి సేవలను మనం
వినియోగించుకోవాలి. మొదట జిల్లాస్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో
ప్రొఫెషనల్‌గా క్రికెట్ ఆడించే పరిస్థితి ఉండాలి. ప్రస్తుతం నిర్వహిస్తున్న
పోటీలకోసం ప్రతి మండలంలో కూడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ పోటీల్లో
మండలస్థాయికి వచ్చేసరికి ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామస్థాయిలో
ఆడేవారికి కూడా క్రీడా సామగ్రిని అందించాలి. ఆటల్లో గెలిపొందిన వారికి
బహుమతులతో పాటు కీడ్రా సామగ్రితో కూడిన కిట్లను కూడా అందించాలి. భవిష్యత్తులో
సచివాలయానికి కూడా క్రీడా సామగ్రితో కూడిన కిట్లను ఇచ్చే ఆలోచన చేయాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్రీడా సామగ్రిని ఏర్పాటు చేసేదిశగా చర్యలు
తీసుకోవాలి. హైస్కూల్ ఆ పైస్థాయిలో తప్పనిసరిగా క్రీడాసామగ్రిని ఏర్పాటు
చేయాలి. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ప్రతి
నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేయాలి. దీనిపై ప్రణాళిక
రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి సీఎస్ డాక్టర్ కేఎస్
జవహర్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, క్రీడలు, యువజన సర్వీసులుశాఖ
ముఖ్యకార్యదర్శి డాక్టర్ జి.వాణీమోహన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్
ఆంధ్రప్రదేశ్(ఎస్‌ఎఎపీ) ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, ఆర్ధిక శాఖ
కార్యదర్శి ఎన్.గుల్జార్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ వీసీ అండ్ ఎండీ
కె.హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.