పవర్ లిఫ్టర్ శ్రీ శ్రీనివాస రావు ని అభినందించిన ద్వారకా తిరుమల రావు
విజయవాడ : అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించి ఇటు సంస్థకు అటు దేశానికీ ఎంతో
ఖ్యాతి తీసుకొచ్చిన కాకినాడ డ్రైవర్ శ్రీనివాస రావుని ఆర్టీసీ ఎం.డి ద్వారకా
తిరుమల రావు ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడ ఆర్టీసీ హౌస్ కి ప్రత్యేకంగా
పిలిపించి సోమవారం ఆర్టీసీ హౌస్ లోని మెయిన్ కాన్ఫరెన్సు హాల్ నందు
శ్రీనివాస్ ని సత్కరించారు. ఆర్టీసీ పేరుని అంతర్జాతీయ స్థాయిలో
ఇనుమడింపజేసినందుకు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని
అభిలషించారు. డ్రైవర్ గా ఉద్యోగ భాద్యతలు నిర్వర్తిస్తూనే తన లోని ప్రతిభకి
కూడా గుర్తింపు వచ్చేలా కృషి చేయడం వెనుక ఎంతో కష్టం ఉంటుందని ఈ సందర్భంగా
ఆయన తెలిపారు. సొంత ఖర్చులతో పోటీలకి సిద్ధపడి ఇన్ని అవార్డులు, బహుమతులు
సంపాదించడం ఎంతో గర్వ కారణమని, భవిష్యత్తులో సంస్థ తరపున కావలసిన సహకారం
అందించడానికి సిద్దంగా ఉన్నామని ఈ సందర్భంగా సంస్థ ఎం.డి ద్వారకా తిరుమల రావు
తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఏ.
కోటేశ్వరరావు(అడ్మిన్), కే.ఎస్. బ్రహ్మానంద రెడ్డి (ఆపరేషన్స్), కృష్ణ
మోహన్(ఇంజినీరింగ్), విజయవాడ జోన్ ఈ.డి గిడుగు వెంకటేశ్వరరావు, ఆర్టీసీ హౌస్
సిబ్బంది, ఎస్.సి. ఎస్.టి. ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.