బ్రిటన్ కు నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన రుషి సునక్ తో ప్రధాని మోదీ గురువారం ఫోన్ లో సంభాషించారు. బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రుషి సునక్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరి మధ్య చోటు చేసుకున్న సంభాషణలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం ప్రధానాంశంగా ఉంది. రెండు దేశాల మధ్య సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎప్.టి.ఏ.) సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ నవంబర్ లోపే ఎఫ్.టి.ఏ. అమలు కావాల్సి ఉన్నా.. బ్రిటన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా అది వాయిదా పడింది. భారత్, బ్రిటన్ ల మధ్య రక్షణ, ఆర్థిక సంబంధాలను మెరుగుపర్చుకోవాలని అభిప్రాయపడ్డారు.
రిషిసునక్ కృతజ్ఞతలు:
బ్రిటన్కు కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి రిషి సునక్ గురువారం తన కొత్త పాత్రపై తనను అభినందించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు తమ భద్రత, రక్షణ,ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఏమి సాధించగలమో “ఉత్సాహంగా” చెప్పారు.
బ్రిటీష్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినందుకు ప్రధాని మోదీ ఆయనతో ఫోన్లో మాట్లాడి అభినందించిన వెంటనే ఆయన పై వ్యాఖ్య చేశారు.
మోదీ ట్వీట్ :
బ్రిటన్ ప్రధాని రుషి సునక్ తో ఫోన్ సంభాషణ అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. యూకే నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రుషి సునక్ ను అభినందించానని తెలిపారు. ఇరుదేశాల మధ్య సహకారం మరింత బలోపేతమయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. బ్రిటన్ ప్రధాని రుషి సునక్ కూడా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కొత్త బాధ్యతలు ప్రారంభమవుతున్న సమయంలో ప్రేమపూర్వక అభినందనలు అందాయని ఆయన వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఎన్నో సారూప్యాలు ఉన్నాయన్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న చారిత్రక సంబంధాలకు తానే ప్రత్యక్ష ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.
“మా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కలిసి పని చేస్తాము. సమగ్ర,సమతుల్య ఎఫ్.టి.ఏ ముందస్తు ముగింపు, ప్రాముఖ్యతపై కూడా మేము ఒక అంగీకారానికి వచ్చాము” అని మోదీ ట్వీట్ చేశారు.