హైదరాబాద్ నలువైపులా విస్తరణ
అవుటర్ వెంట మరో 4 మార్గాల్లో
బీబీనగర్, షాద్‌నగర్, ఇస్నాపూర్, పెద్ద అంబర్‌పేట, ఈసీఐఎల్ వరకు పొడిగింపు
కండ్లకోయ, తూంకుంట వరకు డబుల్ ఎలివేటెడ్ కారిడార్
మొత్తం 278 కి.మీ. మేర నిర్మాణం
హైదరాబాద్ : హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో
కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 69,100 కోట్లతో నగరం నలుదిశలా మెట్రో రైలు
మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో
పెట్టుకొని ప్రజా రవాణాను భారత్‌లోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు పెద్ద
ప్రాజెక్టును చేపడుతున్నాం. ఓఆర్ఆర్ చుట్టూ ఎయిర్‌పోర్టు నుంచి కందుకూరు
వరకు మొత్తం కలిపి రూ.69 వేల కోట్లతో మెట్రో రైలు మార్గాన్ని విస్తరిస్తాం.
నాలుగేళ్లలో దీన్ని పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం సైతం సహకరిస్తుందని
ఆశిస్తున్నాం. సహాయం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుంది.
కేంద్రంలో 2024 తర్వాత సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. అందులో భారాస కీలక పాత్ర
పోషిస్తుంది. అందులోనైనా సాధించుకుంటామనే విశ్వాసం ఉందని సీఎం కేసీఆర్
అన్నారు.
మూడోదశలో 278 కి.మీ. పొడవున కొత్తగా ఎనిమిది మార్గాలతోపాటు అవుటర్ వెంట మరో
నాలుగు మార్గాల్లో మెట్రో నిర్మించాలని మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది.
ఫార్మా సిటీ రానుండడంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి జల్పల్లి, తుక్కుగూడల
మీదుగా కందుకూరు వరకు మెట్రోను విస్తరిస్తారు. వరదలు, ట్రాఫిక్ సమస్యల
నేపథ్యంలో మంత్రిమండలి హైదరాబాద్ నగరంలో ప్రజారవాణా విస్తరణపై విస్తృతంగా
చర్చించింది. ‘తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ. అత్యంత వేగంగా వృద్ధి
చెందుతున్న నగరాల్లో అగ్రభాగాన ఉంది. నగరం ఎంత పెరిగినా, ఎన్ని పరిశ్రమలు
వచ్చినా, లక్షలాది మంది ప్రజలు వచ్చినా తట్టుకునేలా విశ్వనగరంగా ఎదగడానికి,
అన్ని హంగులతో కూడిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలి. దీనికోసం రూ. 69 వేల
కోట్లతో రాబోయే మూడు నాలుగేళ్లలో నిర్దేశిత ప్రతిపాదనలతో చాలా పెద్ద ఎత్తున
మెట్రోను విస్తరిద్దాం. హైదరాబాద్‌లో ఇప్పటికే 70 కిలోమీటర్ల మెట్రోకు అదనంగా
రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మెట్రో మార్గం
నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. కొత్తగా జూబ్లీ బస్టాండ్ నుంచి తూంకుంట వరకు
డబుల్ డెక్కర్ మెట్రో మార్గాన్ని నిర్మిస్తాం. దానిపై ఒక అంచెలో వాహనాలు,
మరో అంచెలో మెట్రో రైలు రాకపోకలుంటాయి. ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా
డబుల్‌డెక్కర్ మార్గం నిర్మిస్తాం. ఇస్నాపూర్ నుంచి మియాపూర్‌కు, అక్కడి
నుంచి లక్డీకాపూల్ వరకు, విజయవాడ మార్గంలో ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్
మీదుగా పెద్ద అంబర్‌పేట వరకు, ఉప్పల్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని
బీబీనగర్ వరకు, శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెట్రో విస్తరణలో భాగంగా
కొత్తూరు- షాద్‌నగర్ వరకు మెట్రో మార్గాన్ని నిర్మిస్తాం. ఉప్పల్ నుంచి
ఈసీఐఎల్ క్రాస్‌రోడ్ వరకు కూడా నిర్మాణం చేపడతాం. పాత నగరంలో మెట్రోను
పూర్తి చేస్తాం. మెట్రో రైల్ అథారిటీ, పురపాలకశాఖలు పూర్తిస్థాయి ప్రతిపాదనలు
సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని సీఎం కేసీఆర్ మంత్రివర్గం
సమావేశంలో తెలిపారు.