IND vs AUS : విశాఖపట్నలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా (Australia)
ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాను 10 వికెట్ల
తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(66) ట్రావిస్ హెడ్ (51)
అర్ధ శతకాలతో చెలరేగారు. వీళ్లిద్దరూ టీ20 తరహాలో బ్యాటింగ్ చేయడంతో
ఆసీస్ మరో234 బంతులు ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. ఈ విజయంతో 1-1తో
వన్డే సిరీస్‌ను సమం చేసింది. సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డే మార్చి 22న
చెన్నైలో జరగనుంది.
29 బంతుల్లో ఫిఫ్టీ
మొదటి వన్డేలో మెరపు ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ మిచెల్ మార్ష్ రెండో
వన్డేలోనూ అదే జోరు కొనసాగించాడు. ఎడాపెడా బౌండరీలు కొడుతూ హాఫ్ సెంచరీ
సాధించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఎనిమిదో ఓవర్లో మూడు సిక్స్‌లు బాది
ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడిన మార్ష్ 29 బంతుల్లో 5 బౌండరీలు, 5
సిక్స్‌లతో యాభైకి చేరువయ్యాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా అర్ధ శతకం
కొట్టడంతో ఆస్ట్రేలియా 11 ఓవర్లకే మ్యాచ్ ముగిచింది.
కోహ్లీ, అక్షర్ మాత్రమే
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 117 పరుగులకు ఆలౌట్ అయింది. స్వదేశంలో
మూడో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. పిచ్ పేస్‌కు అనుకూలించడంతో ఆ జట్టు
స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చెలరేగిపోయాడు. అతని ధాటికి టాపార్డర్
కుప్పకూలింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్(0)ను ఔట్ చేసిన అతను
ఆ తర్వాత ఒకే ఓవర్లో రోహిత్ శర్మ(13), సూర్యకుమార్ యాదవ్(0)ను ఎల్బీగా
వెనక్కి పంపాడు. కేఎల్ రాహుల్(9)ను కూడా ఔట్ చేసి భారత్‌ను ఒత్తిడిలోకి
నెట్టాడు. కుదురుకున్న విరాట్ కోహ్లీ (31) ని ఎల్లిస్ ఎల్బీగా ఔట్ చేశాడు.
అప్పటికి భారత్ స్కోర్.. 71/6.
ఒక దశలో 100 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ, రవీంద్ర
జడేజా (16), అక్షర్ పటేల్ (29) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఏడో
వికెట్‌కు 20 రన్స్ జోడించారు. సియాన్ అబాట్ ఒకే ఓవర్లో కుల్దీప్ యాదవ్
(4), మహమ్మద్ షమీ(0)ని ఔట్ చేశాడు. 26వ ఓవర్ వేసిన స్టార్క్ ఆఖరి బంతికి
సిరాజ్‌ను బౌల్డ్ చేయడంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ బౌలర్లలో
సియాన్ అబాట్ మూడు, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు తీశారు.