టొరంటో : ఓట్ల కోసం ఖలిస్థాన్ అనుకూలవాదులపై మెతక వైఖరి అవలంబిస్తున్నారంటూ
భారత్ తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కెనడా ప్రధానమంత్రి
జస్టిన్ ట్రుడో అన్నారు. తమది చాలా వైవిధ్యభరిత దేశమని, భావప్రకటన స్వేచ్ఛను
ఎల్లప్పుడూ గౌరవిస్తామని పేర్కొన్నారు. అయితే హింస, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా
కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ నెల 8న కెనడాలో ‘ఖలిస్థాన్
స్వాతంత్య్ర ర్యాలీ’ నిర్వహిస్తామంటూ స్థానికంగా పోస్టర్లు వెలిసినవేళ ట్రుడో
తాజాగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు స్పందించారు. ట్రుడో వ్యాఖ్యలకు
భారత్ ఘాటుగా స్పందించింది. ట్రుడో స్పందనకు సంబంధించిన కథనాలను చూశాం. ఇక్కడ
సమస్య భావప్రకటన స్వేచ్ఛ గురించి కాదు. హింస, వేర్పాటువాదాన్ని ప్రచారం
చేసుకోవడానికి, ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి ఆ స్వేచ్ఛ
దుర్వినియోగమవుతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకర్ల
సమావేశంలో పేర్కొన్నారు. మరోవైపు లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై
దాడులు ఏ విధంగానూ ఆమోదయోగ్యం కావని బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్
క్లెవర్లీ స్పష్టం చేశారు. హైకమిషన్ సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రధానమని
పేర్కొన్నారు.