అమెరికా : భారత్‌లో ప్రజాస్వామ్యం చైతన్యవంతంగా ఉందని అమెరికా పేర్కొంది. ఈ
మేరకు శ్వేతసౌధం ప్రతినిధి పేర్కొన్నారు. భారత్ లోని ప్రజాస్వామ్యానికి
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం నుంచి అద్భుతమైన ప్రశంస లభించింది. భారత్
చైతన్యవంతమైన ప్రజాస్వామ్య దేశమని, ఎవరైనా సరే ఢిల్లీ వెళ్లి ఈ విషయాన్ని
స్వయంగా తెలుసుకోవచ్చని శ్వేతసౌధం జాతీయ భద్రతా సలహామండలి సమన్వయకర్త జాన్
కెర్బీ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన చర్చలోనే ప్రజాస్వామ్య సంస్థల బలం ఉంటుందని
తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కెర్బీ మాట్లాడుతూ ‘‘చూడండి..ప్రపంచంలోనే ఎవరితోనైనా సరే ఆందోళనకరమైన విషయాలు
ఉంటే వెల్లడించడానికి మేము ఎప్పుడూ సిగ్గుపడం. త్వరలో జరగబోయే పర్యటన (మోదీ
అమెరికా పర్యటనను ఉద్దేశిస్తూ) ఇరు దేశాల సంబంధాలను మరింత లోతుగా, బలంగా
ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించింది. మీరు చూశారుగా.. ఆస్టిన్ (అమెరికా
రక్షణ మంత్రి) ఇప్పటికే షంగ్రిలా సదస్సులో భారత్‌తో అమెరికా అదనపు రక్షణ
సహకారానికి సంబంధించిన పలు అంశాలను ప్రకటించారు. ఇరుదేశాల వాణిజ్యంలో చాలా
ఇబ్బందులున్నాయి. కానీ, భారత్ క్వాడ్‌లో సభ్య దేశం. ఇండో-పసిఫిక్ వ్యూహంలో
భారత్ చాలా కీలకమైన భాగస్వామి. భారత్ ఎందుకు చాలా ముఖ్యమో నేను ఇలా చాలా
ఉదాహరణలు చెప్పుకొంటూ పోగలను. ఈ సంబంధాలు మా ఇరు దేశాలకు మాత్రమే ముఖ్యమైనవి
కాదు.. బహుముఖంగా చాలా దశల్లో కీలకమైనవి. అందుకే ప్రధాని మోదీతో ఈ అంశాలు
మొత్తం చర్చించి బంధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అధ్యక్షుడు బైడెన్ ఎదురు
చూస్తున్నారని వివరించారు.