టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. కింగ్ విరాట్ కోహ్లీ జీవితకాలంలో అత్యద్భుత ప్రదర్శనతో 82 పరుగులు చేసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. చివరి బంతికి ఒక పరుగు అవసరమైన సమయంలో క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. చుట్టూ ఫీల్డర్లు మోహరించి ఉండడంతో చాలా తెలివిగా అశ్విన్ బంతిని మిడ్-ఆన్ ఫీల్డర్ పైనుంచి కొట్టాడు. దీంతో చివరి బంతికి సులభంగా సింగిల్ వచ్చింది. అంతే భారత శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి.
ఈ చిరస్మరణీయ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ వేడుక చేసుకున్నారు. అయితే మ్యాచ్ ఇంత ఉత్కంఠకు మలుపుతిరగడానికి దినేష్ కార్తీక్ అనవసరంగా ఔటవ్వడమే కారణమైంది. 2 బంతుల్లో 2 పరుగులు అవసరమైన కీలక సమయంలో దినేష్ కార్తీక్ స్టంప్-ఔట్ అయ్యాడు. దీంతో ఒక బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. అదృష్టం కొద్దీ ఒక వైడ్ పడడం, ఆ తర్వాతి బంతికి సింగిల్‌తో అశ్విన్ గెలిపించాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయి ఉంటే దినేష్ కార్తిక్ భారతీయ అభిమానుల ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చేది. ఈ విషయంలో సందేహమే లేదు. ఈ సత్యం దినేష్ కార్తీక్‌కు కూడా బాగా తెలుసు. అందుకే అశ్విన్‌కు కార్తీక్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు. మెల్బోర్న్లో మ్యాచ్ అనంతరం తదుపరి మ్యాచ్ కోసం టీమిండియా సోమవారం సిడ్నీ చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడి చిత్రించిన ఒక వీడియోను బీసీసీఐ ట్వీటర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో అశ్విన్‌కు దినేష్ కార్తీక్ ధన్యవాదాలు చెప్పాడు. ‘‘ నిన్న నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. కూల్‌గా, ప్రశాంతంగా మ్యాచ్‌ను ముగించావు’’ అని దినేష్ కార్తీక్ చెబుతుండడం వీడియోలో కనిపించింది. కాగా ఒకవేళ ఇండియా మ్యాచ్ ఓడిపోయి ఉంటే దినేష్ కార్తీక్ పరిస్థితి ఏంటో ఆలోచిస్తేనే భయానకంగా ఉంది.