న్యూ ఢిల్లీ : ఆపదలో తమకు అండగా నిలుస్తున్న భారత ఆర్మీకి టర్కీ భూకంప
బాధితులు ధన్యవాదాలు తెలిపారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు భారత ఆర్మీ టర్కీ
లోని హతాయ్ ప్రాంతంలో ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. కేవలం ఆరు గంటల్లోనే దీన్ని
ఏర్పాటు చేసింది. ఆ ఆస్పత్రిలో మొత్తం 96 మంది భారత ఆర్మీ సిబ్బంది 24 గంటలూ
సేవలందిస్తున్నారు. ఇప్పటివరకూ 800 మంది బాధితులకు చికిత్స అందించామని
ఆస్పత్రి కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టెనెంట్ కల్నల్ యదువీర్ సింగ్ తెలిపారు. 10
మేజర్ శస్త్ర చికిత్సలు నిర్వహించా మన్నారు. బాధితులకు వైద్యం అందించేందుకు
తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఆపద సమయంలో తమను
ఆదుకుంటున్న ఆర్మీ సిబ్బందిపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
‘‘థ్యాంక్యూ హిందుస్థాన్…మా వెంటే ఉన్నందుకు చాలా ధన్యవాదాలు’’అని
ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న బాధితుడు ఒకరు పేర్కొన్నారు. ఇక స్థానికులకు
సాయపడుతున్న భారత మహిళా ఆర్మీ అధికారిని స్థానికురాలు ఒకరు కృతజ్ఞతాపూర్వకంగా
ముద్దాడుతున్న ఫొటో ఇటీవల వైరల్ అయ్యాయి.