కాఠ్మాండూ : నేపాల్ ప్రధానమంత్రి పుష్పకుమార్ దహల్ ప్రచండ వివాదంలో
చిక్కుకున్నారు. నేపాల్లో స్థిరపడిన ఓ భారత వ్యాపారి తనను ప్రధానిని
చేసేందుకు గతంలో సాయం చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హిమాలయ దేశంలో తీవ్ర
దుమారం రేపుతున్నాయి. ప్రచండ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పెద్దఎత్తున
డిమాండ్ చేస్తున్నాయి. కాఠ్మాండూలో నివసిస్తున్న ప్రముఖ భారత వ్యాపారవేత్త
సర్దార్ ప్రీతమ్సింగ్ జీవితకథపై రచించిన ‘రోడ్స్ టు ది వ్యాలీ’
పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని ప్రచండ
మాట్లాడుతూ ‘‘నేపాల్ – భారత్ బంధాన్ని బలోపేతం చేయడంలో సర్దార్
ప్రీతమ్సింగ్ ముఖ్యపాత్ర పోషించారు. ఆయన ఓ సందర్భంలో నన్ను ప్రధానిగా
చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. నా కోసం అనేకసార్లు దిల్లీ వెళ్లారు.
కాఠ్మాండూలోని రాజకీయ నేతలతో పలుమార్లు చర్చలు జరిపారు’’ అన్నారు. ఈ
వ్యాఖ్యలు నేపాల్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) ఛైర్మన్,
మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మాట్లాడుతూ తన వ్యాఖ్యలపై ప్రచండ కేవలం వివరణ
ఇస్తే చాలదని, దీనికి నైతికబాధ్యత వహిస్తూ తక్షణమే పదవి నుంచి వైదొలగాలన్నారు.
ఆయన మాటలు దేశ స్వతంత్రత, మర్యాదకు భంగం కలిగించాయి. రాజ్యాంగం, దేశ
పార్లమెంటును అవమానించేలా ఉన్నాయని ఓలీ దుయ్యబట్టారు. విపక్షాలే కాదు. సంకీర్ణ
ప్రభుత్వంలోని కొందరు నేతలు కూడా ప్రచండ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ వివాదంపై
ప్రధాని ప్రచండ స్పందిస్తూ.. తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించి వివాదం
రేపుతున్నారని ఆరోపించారు. పుస్తకంలో ప్రీతమ్సింగ్ పేర్కొన్న అంశాలనే తాను
చెప్పానని అన్నారు.