న్యూఢిల్లీ : ఉత్పత్తిని తగ్గిస్తామని ఒపెక్ ప్లస్ దేశాలు చేసిన ప్రకటనతో
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ మంట పుట్టిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే
దాదాపు 6 శాతం పెరిగాయి. అంతకుముందు ఒపెక్ ప్లస్ దేశాల వారాంతపు సమావేశానికి
ముందు శుక్రవారం కూడా క్రూడాయిల్ ధరలు ఎగబాకాయి. మే నెల నుంచి ఈ ఏడాది చివరి
వరకు రోజుకు 11లక్షల 60వేల బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిలో కోత
విధించనున్నట్లు ఒపెక్ ప్లస్ దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో
అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
మే నెల నుంచి ఈ ఏడాది చివరి వరకు ముడిచమురు ఉత్పత్తిలో కోత విధించాలని ఒపెక్
ప్లస్ దేశాలు తీసుకున్న నిర్ణయంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. సౌదీ
అరేబియాతో పాటు మిగిలిన చమురు ఉత్పత్తి దేశాలు తమ రోజువారీ ఉత్పత్తిలో 11లక్షల
60వేల బ్యారెళ్ల చమురును తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో న్యూయార్క్
మర్కంటైల్ ఎక్స్ఛేంజీలో యు ఎస్ బెంచ్ మార్క్ క్రూడాయిల్ ధరలు 5.6 శాతం అంటే
బ్యారెల్కు 4.24 డాలర్లు పెరిగి 79.91 డాలర్లకు చేరాయి. గత అక్టోబరులో ఒపెక్
దేశాలు చమురు ఉత్పత్తి తగ్గించగా ఇపుడు మరోసారి అదే నిర్ణయం తీసుకోవడం
అమెరికాకు కోపం తెప్పించింది. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా బ్రెంట్
క్రూడాయిల్ ధర 5.4 శాతం ఎగబాకింది. అంటే బ్యారెల్కు 4.35 డాలర్లు పెరిగి
84.24 డాలర్లకు చేరింది.
చమురు ఉత్పత్తిలో కోత విధిస్తామనే ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లో తక్షణం చమురు
ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఫలితంగా గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయన్న అంచనాలతో
ఇంధన ధరలు భారంగా మారిన అనేక దేశాలకు మరో సమస్యను తెచ్చిపెట్టాయి. ఈ అధిక
చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు
చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకిగా మారతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రోజుకు 11లక్షల 60 వేల బ్యారెళ్ల ముడిచమురు ఉత్పత్తిని మే నెల నుంచి
తగ్గిస్తామని ఒపెక్ ప్లస్ దేశాలు ప్రకటించాయి. ఇందులో ఒక్క సౌదీ అరేబియానే 5
లక్షల బ్యారెళ్ల ఉత్పత్తిని ఈ ఏడాది చివరి వరకు కోత విధించనున్నట్లు
తెలిపింది. చమురు మార్కెట్లో స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ముందస్తు
చర్యల్లో భాగంగా ఉత్పత్తిలో కోతలు విధిస్తున్నట్లు ఒపెక్ దేశాలు ప్రకటించాయి.
అరబ్ దేశాలు కీలక నిర్ణయం
చమురు ఉత్పత్తిపై అరబ్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. చమురు ఉత్పత్తులను
మే నుంచి తగ్గించాలని నిర్ణయించాయి. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ
అరేబియా, కువైట్, ఇరాక్, ఒమన్, అల్జీరియా దేశాలు సంయుక్తంగా ఒక ప్రకటన
విడుదల చేశాయి. మార్కెట్ స్థిరత్వమే లక్ష్యంగా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ
నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ ఇంధన మంత్రిత్వశాఖ తెలిపింది. అన్ని దేశాలు
స్వచ్ఛందంగా నిర్ణయంగా తీసుకున్నామని ఆయన వెల్లడించారు.