గుజరాత్ లో అడ్డుకున్న కోస్ట్ గార్డ్
పాక్ ఫిషింగ్ బోటులో భారీగా ఆయుధాలను గుర్తించి భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆయుధాలు, 10 మంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్థాన్ ఫిషింగ్ బోటు అల్ సోహెలీని అడ్డుకున్నట్లు భారత్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. ఈ ఆపరేషన్‌ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్)తో కలిసి సంయుక్తంగా నిర్వహించినట్లు భారత్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్లో తెలిపింది. ఆ బోటులో సుమారు 300 కోట్ల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తోపాటు దాదాపు 40 కిలోల మాదకద్రవ్యాలను దాచినట్లు అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ కోసం బోటును ఓఖాకు తీసుకువస్తున్నట్లు కోస్ట్‌గార్డు పేర్కొంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి భారతదేశంలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రధాన సమస్యగా మారింది. దీన్నిఅరికట్టేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్ (హెచ్ హెచ్ టీఐ), నైట్ విజన్ డివైస్ (ఎన్ వీడీ), ట్విన్ టెలిస్కోప్, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ) వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫోర్స్ మల్టిప్లయర్లు మార్గాలుగా ఉపయోగిస్తున్నారని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) తెలియజేసింది.
కరాచీ సమీపంలో ఎక్కడి నుంచో బయలుదేరిన పాకిస్తాన్ బోట్ సిబ్బంది నుంచి భద్రతా సంస్థలు ఆరు పిస్టల్స్, 120 రౌండ్లు స్వాధీనం చేసుకున్నాయని రక్షణ అధికారులు తెలిపారు.
గత 18 నెలల్లో గుజరాత్‌లోని ఇండియన్ కోస్ట్ గార్డ్, ఏటీఎస్ సంయుక్తంగా జరిపిన ఏడవ ఆపరేషన్ ఇది. మొదట డ్రగ్స్‌తో పాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తరలించారు. 44 మంది పాకిస్థానీ, ఏడుగురు ఇరానీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని రూ. 1,930 కోట్ల విలువైన 346 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
2021 సెప్టెంబరు లో గుజరాత్‌లోని కచ్ జిల్లా ముంద్రా పోర్ట్ నుంచి రూ. 21,000 కోట్ల విలువైన 2,988 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నా విషయం గుర్తుకు తెచ్చుకోవచ్చు. సెమీ-ప్రాసెస్డ్ టాల్క్గా దాచబడిన సరుకు, ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ నుంచి ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్ట్ ద్వారా ఎగుమతి చేయబడింది.