అక్షరాస్యత పెరిగిన ప్రస్తుత తరుణంలోవార్తా పత్రికలు మాత్రమే ప్రజలకు సాహిత్యం
వాఙ్మయం,సమాచారం అందించే ఏకైక సాధనాలు
మాండలిక స్పృహ లేకపోతే, ప్రామాణీకరణ పేరుతొ భాష జన బాహుళ్యానికి దూరం అవుతుంది
రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి, ప్రముఖ కవి శ్రీ వాడ్రేవు చిన వీర భద్రుడు
విజయవాడ : ఇంగ్లీష్ భాష నేర్చుకున్నంత మాత్రాన తెలుగు భాషకు నష్టం
కలుగుతుందనేది కేవలం అపోహ అని రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి, ప్రముఖ కవి శ్రీ
వాడ్రేవు చిన వీర భద్రుడు అన్నారు. సి.ఆర్. మీడియా అకాడమీ జర్నలిజం డిప్లమో
విద్యార్థుల్ని, వర్కింగ్ జర్నలిస్టుల్ని ఉద్దేశించి శనివారం ఆయన జూమ్ మీటింగ్
ద్వారా ప్రత్యేక ప్రసంగం చేశారు. ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం, ఉన్నత విద్య,
కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మన యువతకు అంతర్జాతీయ మార్కెట్ లోని ఉన్నత ఉద్యోగ
అవకాశాలు దొరుకుతున్నాయన్నారు. ఇందువల్ల మన పిల్లలు ఇంగ్లిష్ లో విద్యను
అభ్యసించడం కాలానుగుణమైన అవసరమే అని భావించాలన్నారు. ఇంగ్లీషు నేర్చుకోవడం,
తెలుగు భాషను ప్రేమించడం వేరు వేరు అంశాలని ఆయన అన్నారు. ఇంగ్లిష్ భాష పదజాలం
ప్రవేశం వల్ల తెలుగు భాష నాశనమౌతుందనే భావన సరైనది కాదన్నారు. భాషాభిమానం
వీరాభిమానం కాకూడదని ఆయన హితవు పలికారు. జాతీయ ఉద్యమ కాలంలో ఇంగ్లిష్ భాషను
అభ్యసించిన గాంధీ, గుజరాతీ భాషను, టాగోర్ బెంగాలీ భాషను, గురజాడ అప్పారావు,
కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు భాషను అభివృద్ధి పరచిన సంగతిని ఆయన
ప్రస్తావించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగు భాష అంతరించదు అని ఆయన
పేర్కొన్నారు. అనేక మాండలికాల లోని సామాజిక, రాజకీయ, విద్యా పరమైన పరిణామాలు,
అభివృద్ధి ఆ భాషను ఎప్పటికప్పుడు ప్రభావ వంతం చేస్తుంటాయనున్నారు. ఏ మాండలికం
లో అయితే, అత్యధిక సంఖ్యలో రచయితలు, పాత్రికేయులు, నాయకులు, వ్యవహారం లో
వుంటారో ఆ మాండలికం “ప్రామాణిక భాష” గా చెలామణి అవుతుందని ఆయన పేర్కొన్నారు.
తెలుగు భాష “సాహిత్య భాష” గా రూపొందుతున్న కాలంలో వేంగీ సామ్రాజ్యం ప్రధాన
పాత్ర వహించిందన్నారు. అదే ప్రాంతమైన, కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంనుంచి
రాచయితలు, కళాకారులు, పత్రికలు ఎక్కువగా ఆవిర్భవించి నందువల్ల ఉభయ గోదావరి
జిల్లాలు,కృష్ణా, గుంటూరు జిల్లాల భాష ప్రామాణిక భాష గా
రూపుదిద్దుకుందన్నారు. గురజాడ, గిడుగు వంటి వ్యావహారిక భాషా వాదులు కూడా ఈ
ప్రాంత భాషనే ప్రామాణిక భాష గా అంగీకరించడం జరిగిందన్నారు. అణగారిన వర్గాలైన
వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు,తెగలు, అన్ని వర్గాల్లోని మహిళల్లో
అక్షరాస్యత పెరిగిన ప్రస్తుత తరుణంలోవార్తా పత్రికలు మాత్రమే ప్రజలకు సాహిత్యం
వాఙ్మయం,సమాచారం అందించే ఏకైక సాధనంగా ఆయన పేర్కొన్నారు. మీడియా, ప్రజలు భాష
ను వినియోగించడంలో పరస్పరం ప్రభావితం అవుతున్నాయన్నారు.
భాష పత్రికలు, టి.వి. డిజిటల్ మీడియా లతో పాటు, సినిమా మాధ్యమాలకు వ్రాసే భాష
ప్రజా బాహుళ్యం వినియోగం లో వున్న భాష అయి వుండాలని సూచించారు. ముఖ్యంగా
పత్రికలు జాగ్రత్తగా, బాధ్యతగా రాసే భాష ను వినియోగించుకోవాల్సి ఉందన్నారు.
వివిధ మాధ్యమాల్లో మనం వాడుతోన్న భాష ప్రజలకు ఏమేరకు చేరువలో ఉందన్న విషయం
ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాల్సి ఉందన్నారు. మాండలిక పదజాలాన్ని యధావిధిగా
వాడనక్కరలేదుగాని, వాక్య నిర్మాణం లో మాండలిక స్పృహ వుండడం అవసరమన్నారు.
మాండలిక స్పృహ లేకపోతే, ప్రామాణీకరణ పేరుతొ భాషను జన బాహుళ్యానికి దూరంచేయడం
జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రామాణీకరణ పేరుతొ భాషను కృత్రిమంగా ప్రయోగించ
వద్దని ఆయన సూచించారు. ఏదైనా ఒక పదానికి అనువాదం చేసే సందర్భంలో ఆ పదం భారతీయ
సమాజం లో వాడుకలో వున్నదీ లేనిదీ పరిశీలించాలన్నారు. అన్య దేశీయ పదాలైన
గ్లాసు,రైలు, బస్సు, పేపర్, వంటి పదాలు, యాంత్రిక విప్లవం తర్వాత, నాగరికత
రూపాంతరత వల్ల మన భాషలో ప్రవేశించాయన్నారు. వాటిని అలానే వాడాలని ఆయన
సూచించారు. వ్యావహారిక భాషావాభాషను ప్రోత్సహించే క్రమంలో కృత్రిమ భాష వినియోగం
సరైనది కాదన్నారు. మాండలిక స్పృహ వల్ల భాషను కృత్రిమం కాకుండా
కాపాడుకోగలుగుతామన్నారు. వివిధ మాధ్యమాలకు రాసే టప్పుడు వాడే పదజాలం స్థానిక
చేతి వృత్తుల పనివారికి, రైతులకు సంబంధించినవిగా ఉండాలన్నారు. అందువల్ల
ప్రజలకు భాషను దగ్గర చేసిన వాళ్ళం అవుతామన్నారు. అదేవిధంగా వాక్య నిర్మాణం
తెలుగు భావానికి ప్రతిరూపం గా ఉండాలన్నారు. తెలుగు నుడికారాలు, సామెతలు,
వంటివి స్థానికతను ప్రతిబింబిస్తాయన్నారు. అన్యదేశ పదాలు (ఇతర భాషలనుంచి
స్వీకరించిన పదాలు) యధావిధిగా వాడడం మంచిదని ఆయన సూచించారు.
విద్యార్థులకు “ఇంటర్న్ షిప్” కల్పించే చర్యలు
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెస్సర్ పి. హేమచంద్రా రెడ్డి
పరిశ్రమలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలా రాష్ట్రంలోని పరిశ్రమలు ఉన్నత
విద్య శాఖ కలిసి పనిచేసే విధానాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి అమలు
చేస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెస్సర్ పి. హేమచంద్రా
రెడ్డి అన్నారు. సి.ఆర్. మీడియా అకాడమీ జర్నలిజం డిప్లమో విద్యార్థుల్ని,
వర్కింగ్ జర్నలిస్టుల్ని ఉద్దేశించి శనివారం ఆయన జూమ్ మీటింగ్ ద్వారా ప్రత్యేక
ప్రసంగం చేశారు. మానవ వనరులపై 14 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తూ, నాణ్యమైన
ఉన్నత విద్యను, వృత్తి నైపుణ్యాన్ని, కల్పించే దిశగా రాష్ట్రం ముందడుగు
వేస్తోందన్నారు. నాణ్యమైన విద్య, నైపుణ్యం కలిగిన యువత వున్న రాష్ట్రం పై
సహజం గా పారిశ్రామిక వేత్తలు ద్రుష్టి సారిస్తారన్నారు. ఉన్నత విద్య
నేర్చుకునే సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ విద్యార్థులకు “ఇంటర్న్ షిప్”
కల్పించే చర్యలు చేపట్టామన్నారు. ఆన్ లైన్ అవగాహనా సదస్సు కు సి.ఆర్. మీడియా
అకాడమీ చైర్మన్కొ మ్మినేని శ్రీనివాస రావు అధ్యక్షత వహించారు. కోర్సు
డైరెక్టర్ ఎల్.వి.కె రెడ్డి వక్తలను పరిచయం చేశారు. సి.ఆర్. మీడియా అకాడమీ
కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్ బాబు సమన్వయకర్తగా వ్యవహరించారు.